Reading Time: 2 minutes

దుబాయ్: ఇజ్రాయెల్ శుక్రవారం నాడు ఇరాన్, లెబనాన్ రాజధానులపై పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపిస్తూ, విరుచుకుపడింది.50యుద్ధ విమానాలతో క్షిపణుల బంకర్లు ఖమేనీ బంకర్ లక్షంగా దాడులు జరిపి విద్వంసం సృష్టించింది. మరో పక్క అమెరికా ఇరాన్ యుద్ధనౌకలపై వరుస దాడులు జరుపుతోంది. శుక్రవారం ఇరాన్ డ్రోన్ వాహక యుద్ధనౌక పై శతఘ్నులతో దాడిచేయడంతో తగులపడిపోయింది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా పశ్చిమాసియాలో ప్రతీకార దాడులను కొనసాగిస్తోంది. దీంతో రానున్న రోజులలో వైమానిక దాడులు, బాంబుల మోత మరింత జోరుగా సాగుతాయని అమెరికా రక్షణ శాఖమంత్రి పీట్ హెగ్సేత్ హెచ్చరించారు. అమెరికా మాత్రం ఇరాన్ నౌకాదళాన్ని పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో సాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై విసృ్తతంగా దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులలో చాలా భవనాలు నేలమట్టమయ్యాయని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. బహుళ క్షిపణి స్థావరాలు ఉన్న ఇరాన్ నగరంలోని కెర్మాన్షా ప్రాంతం క్షిపణుల పేలుళ్లతో దద్దరిల్లిందని ఇరాన్ వర్గాలు తెలిపాయి.

ఇజ్రాయెల్ సైన్యం దాడులలో ఇప్పటికే ఇరాన్ వైమానిక రక్షణ, క్షిపణి లాంచర్లను దాదాపు నాశనం చేసినట్లు తెలిసింది. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం అంతకంతకు ఇతర దేశాలపై ప్రభావితం చేస్తున్నది. దాదాపు వారం రోజులుగా యుద్ధం సాగుతున్నా, యుద్ధంలో దేశానికి ఏమేరకు నష్టం జరిగిందో లెక్కలేవీ తెలియలేదు. లెబనాన్ లో, ఇజ్రాయెల్, ఇరాన్ – అనుబంధ హిజ్బుల్లా టెర్రరిస్ట్ లపై మధ్య కూడా పోరాటం హెచ్చింది. ఇజ్రాయెల్ గురువారం నుంచి, బీరూట్, దక్షిణ శివారు ప్రాంతాలలో వరుసగా వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ నుంచి పారిపోవడానికి యత్నిస్తున్న వారిని అడ్డుకునేందుకు రోడ్లను స్థంభింపజేసింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ లోని పలు పట్టణాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో ఇరాన్ సైనిక స్థావరాలు, నాయకత్వం, అణుకార్యక్రమం లక్ష్యంగా రెండు దేశాలు విరుచుకుపడుతున్నాయి. విధ్వంసకాండ సృష్టిస్తున్నాయి. గురు, శుక్రవారాలలో ఇజ్రాయెల్ బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాలలో 11 వైమానికదాడులు చేసింది. ఒక గ్యాస్ స్టేషన్ ను తగులపెట్టింది.

ఇరాన్ ప్రతీకారదాడులు, భారీ ప్రాణనష్టం

శుక్రవారం తెల్లవారు జామునే ఇరాన్ పొరుగుదేశాలైన కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ లపై క్షిపణి, డ్రోన్ దాడులను ప్రయోగించింది. ఈ దేశాలన్నీ అమెరికాకు అండగా నిలిచిన దేశాలే. ఈ దేశాలలో చమురు సరఫరాకు ఇరాన్ అంతరాయం కల్గిస్తోంది. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇంతవరకూ యుద్ధంలో ఇరాన్ లో కనీసం 1,200 మంది, లెబనాన్ లో 120 మందికి పైగా, ఇజ్రాయెల్ లో కనీసం 10-15 మంది చనిపోయినట్లు ఆయా దేశాల అధికారులు తెలిపారు. ఆరుగురు అ మెరికా సైనికులు మరణించారు. ఇరాన్ క్షిపణి దాడుల కారణంగా కువైట్ లోని రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేసింది. యుద్ధం నేపథ్యంలో అమెరికా మూసివేసిన రెండో రాయబార కార్యాలయం ఇది.

ఐక్యరాజ్యసమితి శాంతిమంత్రం

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్.. అంతకంతకు తీవ్రమవుతున్న యుద్ధం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పరస్పరదాడులు మానుకోవాలని కోరారు. అన్నిదేశాలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు.

డ్రోన్ క్యారియర్ ధ్వంసం

శుక్రవారం తెల్లవారుజామున ఇరానియన్ డ్రోన్ క్యారియర్ ను ఢీకొట్టి ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. యుద్ధనౌక తగులపడుతున్న దృశ్యాలను అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ విడుదలచేసింది. ఇరాన్ ఈ దాడిని ధృవీకరించలేదు. రెండురోజుల క్రితం శ్రీలంక తీరంలో అమెరికా జలాంతర్గామి ఇరానియన్ యుద్ధనౌకను పేల్చివేసి, సముద్ర జలాలలో ముంచివేయడంతో కనీసం 100 మంది నావికులు చనిపోయారు.

ఇరాన్ లోని బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లపై బాంబు వర్షం

శుక్రవారం తెల్లవారుజామున అమెరికా బి-2 స్టెల్త్ బాంబర్లు ఇరాన్ లో రహస్యప్రదేశంలో ఉంచిన బాలిస్టిక్ క్షిపణి లాంచర్లపై డజన్లకొద్ది 2000 పౌండ్ల పెనెట్రేటర్ బాంబులను కురిపించినట్లు తెలిపారు.

ఇరాన్ డ్రోన్ లు కూల్చివేత

ఖతార్ లో అమెరికాకు చెందిన అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని టార్గెట్ చేస్తున్న ఇరాన్ డ్రోన్ లను ధ్వంసం చేసినట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. దక్షిణంగా ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం వైపు దూసుకువస్తున్న మూడు బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేసినట్లు సౌదీ రక్షణ శాఖ ప్రతినిధి ప్రకటించారు.