
మనతెలంగాణ/హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగజాతి ఎంతో పోరాటం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ పోరాటంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తుచేశారు. స్వయంగా తాను ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ సమస్యను ప్రత్యక్ష్యంగా చూస్తూ వచ్చానని, ఈ న్యాయమైన హక్కుపై మొదటినుంచి తాను అనుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ సమస్యపై పోరాటం చేసినందుకు గతంలో తనను అసెంబ్లీ నుంచి గెంటేశారని ఆయన వాపోయారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డానని, తనతో పాటు అనేకమంది వర్గీకరణ కోసం పోరాటం చేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణ కోసం ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణకే దక్కిందన్నారు. వర్గీకరణ అంశంలో మాదిగల వైపు న్యాయం ఉందని, ఇందులో తనకు ఎటువంటి అనుమానం లేదని, అందుకే చివరి వరకు మీకోసం స్టాండ్ తీసుకున్నానని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ శుక్రవారం నిర్వహించిన ధన్యవాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ సామాజికవర్గ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్రధర్మం
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ మహాభారతంలో తన ఫేవరేట్ క్యారెక్టర్ కర్ణుడు, బర్బరీకుడని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్రధర్మం పాటిస్తున్నానని ఆయన తెలిపారు. బర్బరీకుడు బలహీన పక్షాల వైపు నిలబడ్డ వ్యక్తి అని ఆయన తెలిపారు. అందుకే మాదిగల విషయంలో వర్గీకరణ కోసం బర్బరీకుడిలా పనిచేశానని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మనదేనని సిఎం అన్నారు. మాదిగల సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్యలను కాదని ఆయన తెలిపారు. కానీ, వెనుక నుంచి కుట్రలను మీరే అడ్డుకోవాలని ఆయన సూచించారు. మాదిగ జాతి ఇంకా వెనుకబాటు తనం అనుభవిస్తుందని, వెనుకబాటు తనం పోవాలంటే చదువే పరిష్కారం అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూములు పంచలేం కానీ, చదువు చెప్పిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి విద్యను దగ్గర చేయడానికే స్వయంగా తానే విద్యాశాఖ తీసుకున్నానని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖను ప్రక్షాళన చేశామన్నారు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. బ్యాగులతో కూడిన కిట్ ఇవ్వబోతున్నామని, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని, రాష్ట్రంలో పేదరికమనే కారణంతో ఎవరూ విద్యకు దూరం కాకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సిఎం చెప్పుకొచ్చారు.
మాదిగలు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి
గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చి చెప్పులు కుట్టుకొమ్మని చెప్పిందని, బర్రెలు, గొర్రెలు, చేపలు కాదు, చెప్పులుకుట్టుకుంటున్న జాతి ఈ రాజ్యాన్ని నడపాలని సిఎం రేవంత్ సూచించారు. మాదిగలు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలని, తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి నెలా 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, నెలకు రూ.1,000 కోట్లు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తోందని సిఎం అన్నారు. అయినా సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనని, అక్రమాలను అరికట్టి ఖజానాకు నిధులు తీసుకువస్తే పది మందికి సహాయం అందుతుందని ఆయన తెలిపారు.
నేను అందరివాడిని
ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు రేవంత్ మాదిగ అని, బిసిలకు న్యాయం చేసినప్పుడు రేవంత్ యాదవ్ అని, వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే రేవంత్ ముదిరాజ్ అని, సిక్కుల విషయంలో సర్దార్ రేవంత్ అని, అసదుద్దీన్‌కు సాయం చేస్తే రేవంతుద్దీన్ అని తనను కొందరు అన్నారని, వారు ఎలా పిలిచినా తనకు ఇబ్బంది లేదని, తాను అందరి వాడినిని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
లక్షలాది మందితో భారీ అభినందన సభ
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందితో భారీ అభినందన సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంబేద్కర్ స్ఫూర్తితో సమాజాభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అంబేద్కర్ టవర్ పేరుతో భారీ భవనాలు నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ లోయర్ ట్యాంక్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ శిథిలావస్థలో ఉందని, అక్కడ కనీసం విద్యుత్ కూడా లేని పరిస్థితి నెలకొందని మంత్రి విమర్శించారు. ఆ భవనానికి వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించానని ఆయన తెలిపారు.