
హైదరాబాద్: మాదిగల సమస్యలను పరిష్కరించేటప్పుడు అడ్డుకునే వారిని మాదిగలే నిలువరించాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదిగ ఎంప్లాయిస్ కోఆర్టినేషన్ కమిటీ ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డికి సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకాల కోసం ఎక్కువగా మాదిగ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారని అన్నారు. మాదిగలు బాధ్యతతో వ్యవహరిస్తే వాళ్ల జాతికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్సి, ఎస్టి, బిసిలకు సంక్షేమ ఫలాలు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని.. చదవు ఒక్కటే ప్రజలకు ఇవ్వగలిగే ఆస్తి అని అన్నారు. నాణ్యమైన విద్య కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలను పంపిణీ చేసిందని.. మాదిగలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా.. వాళ్ల పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలా? అని ప్రశ్నించారు. మాదిగలు కూడా ఐఎఎస్, ఐపిఎస్, ఎంపి, ఎమ్మెల్యేలు అవ్వాలని పేర్కొన్నారు. మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత తనది స్పష్టం చేశారు.