
800 రోజుల పాలనలో చేసింది ఏం లేక, 99 రోజు ప్రణాళిక పేరిట రేవంత్ రెడ్డి మరో డ్రామాకు తెరతీశారని ఆయన ఆరోపించారు. రెండున్నరేళ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా? అంటూ హరీష్‌రావు నిలదీశారు. అమలుకు నోచుకోని ఆరుగ్యారంటీలు, పాలన వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కాంలు, ప్రజల ఛీత్కారాల నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ ఇది అని ఆయన విమర్శించారు.
ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని ఆయన పేర్కొ న్నారు. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ, మళ్లీ ఇప్పుడు పది వారాల పాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం కావడం సిగ్గు చేటన్నారు.