
ముంబై: టి20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్ సమరానికి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, మాజీ విజేత ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ పోరు జరుగనుంది. సూపర్8లో ఇంగ్లండ్ వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి సెమీస్‌కు దూసుకొచ్చింది. భారత్ మాత్రం కాస్త చెమటోడ్చి సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. అయితే కచ్చితంగా గెలవాల్సిన చివరి రెండు మ్యాచుల్లో అద్భుత విజయం సాధించిన ఇంగ్లండ్‌తో పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సంజు తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియాకు ఎదురే ఉండదు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తన పాత్రను సక్రమంగా నిర్వర్తించాలి.
ఈ వరల్డ్‌కప్‌లో ఆరు మ్యాచులు ఆడిన అభిషేక్ కేవలం ఒక దాంట్లో మాత్రమే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. మిగతా వాటిల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్‌తో జరిగే సెమీస్ మ్యాచ్ అతనికి సవాల్‌గా మారింది. వరుస వైఫల్యాలకు పుల్‌స్టాప్ పెట్టి తన సహాజ శైలీలో బ్యాట్‌ను ఝులిపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇషాన్ కిషన్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. అయితే ఇషాన్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం ఆందోళన కలిగించే అంశమే. ఒక మ్యాచ్‌లో రాణిస్తే తర్వాతి పోరులో విఫలం కావడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ పద్ధతిని మార్చుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత ఇషాన్‌పై ఉంది.
అందరి కళ్లు సూర్యపైనే..
మరోవైపు జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఏర్పడింది. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో సూర్య జట్టుకు కీలకంగా మారాడు. బ్యాట్‌తో పాటు కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలవాల్సిన పరిస్థితి సూర్యకు నెలకొంది. సూర్య తన మార్క్ ఆటతో చెలరేగితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్, హార్దిక్, అక్షర్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
జోరుమీదున్న ఇంగ్లండ్
ఇంగ్లండ్ కూడా వరుస విజయాలతో జోరుమీదుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. విల్ జాక్స్, సామ్ కరన్ ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్నారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, రెహాన్, టామ్ బాన్‌టన్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్ మెరుగ్గా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో సెమీస్ పోరు ఆసక్తి కరంగా సాగడం ఖాయం.
రాత్రి 7 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..