
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపిఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చా లా ఆలస్యంగా 2025లో జరిగిందన్నారు. ఆ సమయంలోనూ కేవ లం 7 గురు ఐపిఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటా యించారని సిఎం వివరించారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కోంటోందని సిఎం తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ క మిషనర్, హైదరాబాద్ నగరంలో భారగీ పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపిఎస్ అధికారుల అవసరం ఉందని కేంద్ర మంత్రి అమిత్ షాకు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని కేంద్ర మంత్రి కి సిఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపిఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచి
కేటాయించాలని సిఎం కోరారు. అనంతరం మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా… ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్రనాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలు వారి మధ్య చర్చకు వాచ్చియి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని సిఎం తెలిపారు. రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి సిఎం తెలియజేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డిజిపి బి.శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషినల్ డిజిపి విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజిపి బి.సుమతి పాల్గొన్నారు.