Reading Time: < 1 minute

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో విద్యార్థులు గురువారం నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలకు హాల్ టికెట్లను ఇప్పటికే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించామని, గతంలో ప్రకటించిన విధంగా ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు ఇదే సమయం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరునున్నట్లు పేర్కొన్నారు. హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు www.bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్ ను సంప్రదించాలని, విద్యార్థులు తమ హాల్ టికెట్ల కోసం 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపి, ఆపై SSC Hall Ticket March-2026 అని టైప్ చేయడం ద్వారా కూడా పొందవచ్చని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, దీంతో పాటు 040-23230942 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.