Reading Time: 2 minutes
Anand Mahindra: గుంటూరు మిరప తోటలను షేర్‌ చేస్తూ కీలక ట్వీట్‌ చేసిన ఆనంద్ మహీంద్రా

పారిశ్రామికవేత్త Anand Mahindra హోలీ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో ఆలోచనాత్మక సందేశాన్ని పంచుకున్నారు. భారతదేశపు వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా, దేశంలోని వివిధ రాష్ట్రాలను రంగుల రూపంలో చూపిస్తూ, అవన్నీ కలిసిపోయి ఒక అందమైన హోలీ కానుకలా కనిపించేలా రూపొందించిన AI చిత్రాన్ని ఆయన షేర్ చేశారు.

“హోలీ రోజున రంగులు పోటీ పడవు. అవి కలిసిపోతాయి.” హోలీ పండుగ భారతదేశ అసలు స్ఫూర్తిని గుర్తు చేస్తుందని, “అనేక రంగులు, ఒక అందమైన కాన్వాస్” అని పేర్కొంటూ అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, మహీంద్ర కేవలం AI చిత్రంతో ఆగిపోలేదు. “హోలీ రోజున తప్పక చూడాల్సిన వీడియో” అని పేర్కొంటూ మరో వీడియోను కూడా పంచుకున్నారు. “భారతదేశపు రంగులు ఎన్నో విధాలుగా వెలుగుతాయి. మనల్ని ఆశ్చర్యపరుస్తాయి,” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: ఇక అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం

అతను గుంటూరు జిల్లాలో తీసిన రెండు వీడియోలను షేర్ చేశారు. ఆ ఏరియల్ దృశ్యాల్లో రైల్వే ట్రాక్ రెండు వైపులా ఎర్రగా పరచి ఉంచిన మిరపకాయలు కనిపిస్తాయి. పై నుంచి చూసినప్పుడు అవి అద్భుతమైన రంగులు కనిపిస్తాయి.

 

“ఎండబెట్టడానికి పరచిన మిరపకాయలు పై నుంచి చూసినప్పుడు అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఒక్కదానికే భారతదేశ మిరప ఉత్పత్తిలో 15% వాటా ఉంది. ఈ సీజనల్ పంటను పర్యాటక ఆకర్షణగా మార్చలేమా? ఇది శీతాకాలపు పంట కాబట్టి సమయం కూడా అనుకూలమే,” అని మహీంద్ర పేర్కొన్నారు.

“నేను అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదు. అయితే నేలమీద నుంచి చూస్తే ఈ అందం అంతగా కనిపించకపోవచ్చు అనిపిస్తోంది. బెలూన్ రైడ్స్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఆ సమయంలో స్థానిక సంగీతం, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఒక పండుగలా నిర్వహిస్తే? ఇంకేమైనా ఆలోచనలు? కొంతమంది పర్యాటకులతో అంతరాయం కలగకూడదని భావించవచ్చు. కానీ అలా చేస్తే స్థానిక రైతులు, సమాజాలకు అదనపు ఆదాయం సంపాదించే అవకాశం కోల్పోతాం,” అని ఆయన పేర్కొన్నారు.

 

ఈ పోస్ట్ వైరల్ అయి నెటిజన్ల నుంచి అనేక స్పందనలు వచ్చాయి. “గుంటూరు మిర్చి పొలాలు ఇప్పటికే భారతదేశపు సహజ హోలీ కాన్వాస్‌లాంటివే. సరైన ప్రణాళికతో ఇది ప్రపంచ స్థాయి అగ్రి-టూరిజం పండుగగా మారి రైతులకు మద్దతు ఇస్తుంది. ఆంధ్ర గర్వాన్ని ప్రపంచానికి చూపిస్తుంది.” అంటూ వ్యాఖ్యానించాడు.

“‘గుంటూరు మిర్చి మేళా’ నిర్వహిస్తే అద్భుతంగా ఉంటుంది. డ్రోన్ వీక్షణ ప్రాంతాలు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్, కూచిపూడి, స్థానిక జానపద నృత్యాలు, మిరప రుచుల స్టాల్స్, రైతుల మార్గదర్శక టూర్లు—ఇలా నిర్వహిస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఆంధ్ర గర్వం వెలుగులోకి వస్తుంది,” మరో నెటిజన్ పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: నెలకు రూ.10,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో చేతికి రూ.32 లక్షలు