Reading Time: < 1 minute

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుల రారాజు. ఆయన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నారు. అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించారు. అయితే ఆయన తనయుడిగా క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అర్జున్ టెండూల్కర్.. తాజాగా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 50 వికెట్ల క్లబ్‌లో ఈ ఆల్ రౌండర్ చేరాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో గోవా తరఫున ఆడుతున్న అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు.

2022-23 సీజన్‌లో గోవా తరఫున తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అర్జున్ రాజస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సెంచరీ చేయడమే కాకుండా.. బౌలింగ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. అయితే ప్రస్తుతం అతడి ఖాతాలో ఉన్న 50 వికెట్లలో 13 వికెట్లు ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లోనూ సాధించడం విశేషం. అయినప్పటికీ.. వికెట్ల విషయంలో సచిన్ కంటే అర్జున్ వెనుకంజలో ఉన్నాడు. సచిన్ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో మొత్తం 71 వికెట్లు తీశారు. దేశవాళీ కెరీర్‌లో తొలుత ముంబై తరఫున ఆడిన అర్జున్ ఆ తర్వాత గోవాకి మారాడు. ఇక ఐపిఎల్‌లో ముంబై జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన అర్జున్.. 2026లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ట్రేడ్ ద్వారా వెళ్లాడు.