Reading Time: 2 minutes
Akash Deeps Viral Wedding Remark On Ms Dhoni Virat Kohli And Rohit Sharma Wins Fans Hearts

Akash Deep Reveals Why Missing Dhoni and Kohli His Wedding: భారత క్రికెట్ జట్టు పేసర్ ఆకాశ్ దీప్ ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం రాత్రి వారణాసిలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో అక్షిత రాజ్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. ఆకాశ్, అక్షితల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆకాశ్ బుధవారం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఆ వేడుకలో జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

పెళ్లి వేడుకలో ఓ అతిథి ఆకాశ్ దీప్‌ను ఉద్దేశించి.. ‘అన్నా.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలను మీ పెళ్లికి ఎందుకు ఆహ్వానించలేదు?’ అని ప్రశ్నించాడు. దీనికి ఆకాశ్ సరదాగా స్పందిస్తూ.. ‘వాళ్లు ఇక్కడికి వస్తే అసలు పెళ్లి జరుగుతుందా?’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు పెళ్లికి హాజరైతే.. భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. దాంతో పెళ్లి వేడుక నిర్వహణ కష్టతరమవుతుందని ఆకాశ్ ఉద్దేశం. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవగా.. క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఆకాశ్ దీప్ ఇప్పటివరకు భారత్ తరఫున 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 6/60 కాగా.. ఒక మ్యాచ్‌లో 10/112 బెస్ట్ ప్రదర్శనగా నిలిచింది. గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన టెస్టులో 12 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శన అతని కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయం కారణంగా కేకేఆర్ తరఫున ఆడలేదు. అదే గాయం కారణంగా భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకునే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో ఉన్న ఆకాశ్.. త్వరలోనే మైదానంలోకి తిరిగి రావాలని చూస్తున్నాడు.