
Off The Record: తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల హడావిడి లేదు. కానీ… బీఆర్‌ఎస్ అగ్రనేతలు మాత్రం రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మామూలుగా అయితే… పెద్ద నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యక్రమాలు చేయడానికి ఏదో ఒక అకేషన్ సృష్టించుకుంటారు. అయితే… ఇప్పుడు గులాబీ లీడర్స్‌కు వాళ్ళు క్రియేట్ చేసుకునే అవసరం లేకుండా…అధికారిక ప్రక్రియనే వాడుకుంటున్నారట. ఓటర్ల జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న SIR ప్రక్రియపై అవగాహన సదస్సుల పేరుతో కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ… పనిలో పనిగా కేడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బీఎల్‌ఏలను ఏర్పాటు చేసి వారితో మీటింగ్స్ పెడుతున్నారు. ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సుల్లోనే… పార్టీ సభ్యత్వ నమోదు గురించి కూడా పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తున్నారట. ఎన్నికలకు ఇక రెండున్నరేళ్ళ సమయం మాత్రమే ఉండడంతో క్షేత్ర స్థాయిలో పూర్తి పటిష్టతపై దృష్టి పెట్టింది గులాబీ అధిష్టానం. ఒకరోజు హైదరాబాదులో సమావేశం పెడితే… మరో రోజు జిల్లాలో మీటింగ్ అంటూ తిరుగుతున్నారు కేటీఆర్, హరీష్‌రావు. ఈ సమన్వయ సమావేశాల్లో కార్యకర్తలను ఉత్తేజ పరిచే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు.
అలాగే… రాష్ట్ర ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉన్న రాజకీయ పరిణామాల గురించి కూడా అదే వేదికల మీద మాట్లాడుతూ అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటున్నారు. నియోజకవర్గ సమస్యలపై ఓవైపు మాట్లాడుతూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలపై కూడా స్పందిస్తుండడంతో… బీఆర్‌ఎస్ అవగాహనా సదస్సులకు కేడర్‌లో కూడా క్రేజ్ పెరుగుతోందట. ఇద్దరు నేతలు జిల్లాలకు వెళ్లినప్పుడు ఉదయం ఒక నియోజకవర్గం, మధ్యాహ్నం మరొక నియోజకవర్గంలో మీటింగ్స్ పెడుతూ కేడర్‌ని గేరప్ చేస్తున్నారు. అలాగే వీరితోపాటు మాజీ మంత్రులు, మరికొందరు రాష్ట్ర స్థాయి నేతలు కూడా నియోజకవర్గ సమన్వయ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేవలం వెళ్ళామా, మాట్లాడామా అన్నట్టు కాకుండా… ప్రసంగాల తర్వాత కార్యకర్తలతో మమేకం అవుతూ వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఒక్కొక్క మీటింగ్‌లో నాలుగు గంటల వరకు సమయం గడుపుతుండటంతో కింది స్థాయిలో కూడా సంతృప్తి వ్యక్తం అవుతోందట. ఆ విధంగా… అవి పేరుకు ఎస్‌ఐఆర్ మీద అవగాహన కార్యక్రమాలు అయినా… పార్టీ బలోపేతానికి బాగా ఉపయోగపడుతున్నాయన్న చర్చ బీఆర్‌ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఇలా నియోజకవర్గాల వారీగా జరిగే సమన్వయ సమావేశాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలిస్తున్నట్టు చెబుతున్నారు పార్టీ నేతలు.
ఏ నియోజకవర్గంలో ఎలా మాట్లాడాలో కూడా కేసీఆర్ సూచిస్తున్నట్టు సమాచారం. తమ బాస్ బయటకు రాకున్నా…. ఇంటర్నల్‌గా ఇస్తున్న గైడెన్స్ బాగా ఉపయోగపడుతోందన్న చర్చలు నడుస్తున్నాయి కారు పార్టీ వర్గాల్లో. ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన నియోజకవర్గ సమన్వయ సమావేశాలకు స్పందన బాగా ఉంటుండటంతో… రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గాన్ని వదలకుండా ప్రతిచోట ప్రోగ్రామ్ నిర్వహించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.