Reading Time: < 1 minute

సినిమా స్టైల్‌లో ప్లాన్ చేశాడు.. పాతబస్తీలో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి.. రూ 17 లక్షలతో డ్రైవర్ జంప్

Caption of Image.

హైదరాబాద్ పాతబస్తీలో పక్కా ప్లాన్‌తో జరిగిన ఒక భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచే లక్షల రూపాయల నగదు మాయమవడం తీవ్ర సంచలనంగా మారింది.

ఐఎస్ సదన్ పరిధిలోని ఈదీ బజార్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు నింపేందుకు ఒక క్యాష్ వ్యాన్ వచ్చింది. ఎప్పటిలాగే ఏటీఎంలో క్యాష్ లోడ్ చేయడానికి సెక్యూరిటీ గార్డ్, మిగతా సిబ్బంది లోపలికి వెళ్లారు. అదే అదనుగా భావించిన క్యాష్ వ్యాన్ డ్రైవర్.. తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. వ్యాన్ లోపల నోట్ల కట్టలతో ఉన్న ట్రంక్ బాక్స్ నుంచి.. సుమారు 17 లక్షల రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా ఒక బ్యాగ్‌లోకి మార్చేశాడు.

►ALSO READ | జల్సాల కోసం బైక్ చోరీలు..కుషాయిగూడలో ఒక్కడే 14 బైకులు ఎత్తుకెళ్లిండు

అయితే ఈ దొంగతనం అప్పటికప్పుడు చేసింది కాదు.. పక్కా ప్రణాళికతో ముందే స్కెచ్ వేసి మరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రైవర్ డబ్బుల బ్యాగ్‌ను సర్దుకున్న వెంటనే.. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఒక వ్యక్తి బైక్‌పై అక్కడకు వచ్చాడు. క్షణాల వ్యవధిలో డ్రైవర్ ఆ డబ్బు బ్యాగ్‌తో కలిసి సదరు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. సిబ్బంది వచ్చి చూసేసరికి డబ్బుతో సహా డ్రైవర్ మాయమవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సమాచారం అందుకున్న ఐఎస్ సదన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ భారీ చోరీ కేసును ఛేదించేందుకు చార్మినార్ జోన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్‌తో పాటు, అతనికి సహకరించిన ఆ బైక్ రైడర్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

©️ VIL Media Pvt Ltd.