
తెలంగాణ టీ20 (TG20) లీగ్ 2026లో సరికొత్త చరిత్ర నమోదైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒకేరోజు రెండు మెరుపు శతకాలు నమోదై అభిమానులను ఉర్రూతలూగించాయి.
మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ కెప్టెన్, ఓపెనర్ అమన్‌రావు పేరాల మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటిన అమన్.. మొత్తం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టోర్నీ చరిత్రలోనే తొలి శతకధారిగా రికార్డుకెక్కాడు. మొత్తంగా 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 142 పరుగులు చేయడంతో వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్‌ను వారి కెప్టెన్, టీమిండియా సూపర్‌స్టార్ తిలక్ వర్మ ముందుండి నడిపించాడు.
ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. తిలక్ వర్మ కేవలం 42 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో తన తొలి టీజీ20 సెంచరీ (103) మార్క్‌ను అందుకున్నాడు. తిలక్ వీరోచిత పోరాటంతో 16 ఓవర్లు ముగిసేసరికి మెదక్ స్కోరు 205/6కి చేరింది. మెదక్ విజయానికి చివరి 24 బంతుల్లో ఇంకా 54 పరుగులు అవసరం కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే చివరిలో తిలక్ వర్మ బ్యాట్ తో విజృంభించడంతో 136 పరుగులు చేసి.. మెదక్ కు విజయాన్ని అందించాడు. ఇంకా రెండు బాల్స్ మిగిలి ఉండగానే మెదక్ ఫాల్కన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసి విజయం సాధించింది.