
- సర్కారు స్వాధీన ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్
- కొత్త రుణ సంస్థల ఎంపిక జరిగే వరకు బాధ్యతలు
- సీఎస్, ఎల్ అండ్ టీ ప్రతినిధుల భేటీలో అంగీకారం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో నిర్వహణ మరికొంతకాలం ఎల్అండ్టీ చేతుల్లోనే ఉండబోతోంది. కేంద్రంతో జరిగిన ఒప్పందంలో భాగంగా మెట్రో స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఎల్ అండ్ టీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రెండు దశల మెట్రోను విలీనం చేసి కొత్త రుణాన్ని సమీకరించే వరకు మెట్రో మొదటి దశ నిర్వహణ బాధ్యతలను కొనసాగించాలని కోరడంతో ఎల్ అండ్ టీ ప్రతినిధులు అంగీకారించారు. కేంద్రం సూచన మేరకు కన్సల్టెన్సీ హోదాలో ఎస్‌బీఐ కాప్స్సంస్థ మెట్రో ఆస్తుల మదింపు, కొత్త రుణ సంస్థల ఎంపిక చేపట్టబోతోంది. ఇందుకు మరో రెండు, మూడు నెలలు పట్టే అవకాశమున్నట్లు సమాచారం.
ప్రభుత్వానికి తగిన సమయం..
మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన నిధుల సమీకరణలో ఏర్పడిన ఆటంకాల వల్లే ఆ సంస్థ నిర్వహణను పొడిగించాల్సి వచ్చింది. మొదటి దశ మెట్రో స్వాధీనానికి అవసరమైన రూ.13,600 కోట్ల జపాన్ రుణ ప్రక్రియ నిలిచిపోవడం, కేంద్ర-రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్త ఆర్థిక నమూనా తెరపైకి రావడంతో తక్షణ బదిలీ సాధ్యపడలేదు.
ఈ నేపథ్యంలో, హ్యాండోవర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మెట్రో సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ఎల్ అండ్ టీ నిర్వహణలోనే కొనసాగించడం అనివార్యంగా మారింది. ఈ ప్రక్రియ వల్ల నిధుల సర్దుబాటుకు ప్రభుత్వానికి కొంత సమయం దొరుకుతుందనే ఉద్దేశంతో ఎల్ అండ్ టీ బాధ్యతలను తాత్కాలికంగా పొడిగించనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.
సీఎస్తో ఎల్ అండ్ టీ ఉన్నతాధికారుల భేటీలో ఈ మేరకు కార్యాచరణ ఖరారైనట్లు స్పష్టంచేశాయి. నివేదికల తయారీ, రుణ సంస్థల ఎంపికకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతున్నందున, ఆ లోపు మెట్రో రోజువారీ కార్యకలాపాలు ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలోనే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూనే.. సాంకేతిక పర్యవేక్షణ, రక్షణ బాధ్యతలను ఎల్ అండ్ టీనే చూసుకోనుంది. ప్రభుత్వ అంచనాలు ఒక కొలిక్కి వచ్చే వరకు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించేందుకు ఎల్ అండ్ టీ కూడా తన అంగీకారం తెలిపినట్లు చెప్తున్నారు.
తక్కువ వడ్డీ రుణాల కోసం అన్వేషణ..
ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో మెట్రో నడిచే ఈ రెండు, మూడు నెలల కాలంలోనే ఎస్‌బీఐ క్యాప్స్ సంస్థ మెట్రో ఫేజ్1 ఆస్తులు, అప్పుల విలువను మదింపు చేయనుంది. మొదటి దశ ఆస్తులను ఎల్ అండ్ టీ నుంచి బదిలీ చేసుకోవడానికి కచ్చితంగా ఎంత సొమ్ము అవసరమో తేల్చడంతో పాటు, రెండు దశలకు కలిపి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థలను ఈ కన్సల్టెన్సీ అన్వేషించనుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇద్దరు అధికారుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
అంటే, ఒకవైపు క్షేత్రస్థాయిలో ఎల్ అండ్ టీ పర్యవేక్షణలోనే రైళ్లు నడుస్తుండగా, మరోవైపు బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల లెక్కింపు వేగంగా సాగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో గతంలో రుణాల కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ)కి చెల్లించిన ఫీజులను వెనక్కి తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి బదిలీ ఖర్చులపై దృష్టి సారించింది. ఎల్ అండ్ టీ నిర్వహణలో కొనసాగుతున్న ఈ పరిమిత సమయం కొత్త ఆర్థిక భాగస్వామ్యాల ఏర్పాటుకు దోహదపడనున్నట్లు చెప్తున్నారు.