
- ఐదెకరాలకు ఫెన్సింగ్.. మర్రిపల్లిలో చెరువుకు విముక్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖానామెట్‌లో రూ. 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటంతో పాటు, మర్రిపల్లి చెరువు ఆక్రమణలను కూడా తొలగించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 42లో ఐదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కొందరు వ్యక్తులు అక్కడ రెండు తాత్కాలిక షెడ్లు, ఒక రూమ్ నిర్మించారు.
భూమి చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. పోలీసు బందోబస్తు మధ్య అక్కడి తాత్కాలిక షెడ్లు, గది, రేకుల ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. భూమి చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరో ఆపరేషన్‌లో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మర్రిపల్లి చెరువులో వెలిసిన ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్ పరిధిని అధికారులు కాపాడారు.