
రుతుపవనాలపై కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. బుధవారం పశ్చిమ తీర ప్రాంతాలు.. మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఎండల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించింది.
ఐఎండీ అంచనాల ప్రకారం.. కొంకణ్-గోవా, తీర కర్ణాటక, అస్సాం-మేఘాలయ, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే బీహార్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కొంకణ్-గోవా, తీర కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బీహార్‌లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నప్పటికీ.. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో మాత్రం వడగాల్పుల పరిస్థితులు కొనసాగనున్నాయి. అక్కడక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలు, దక్షిణ భారత రాష్ట్రాలు, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ వారం మొత్తం రుతుపవనాలు చురుగ్గా కొనసాగనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. కొంకణ్-గోవా, కేరళ, తీర కర్ణాటక, తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని.. అస్సాం, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో కూడా తరచుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.