
ఐర్లాండ్ పర్యటనకు ముందే భారత క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐర్లాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అంతేకాదు, ఐర్లాండ్ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌లో కూడా నితీశ్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
నితీశ్ రెడ్డికి ఎడమ తొడ కండరంలో వాపుతో పాటు కండరాల ఫైబర్లకు దెబ్బ తగిలినట్లు ఎంఆర్ఐ స్కాన్‌లో తేలింది. దీంతో నితీశ్‌ను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పిలిపించి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుత సమాచారం మేరకు ఈ గాయం నుంచి నితీశ్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే అతను రిటర్న్ టు ప్లే ప్రక్రియను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కారణంగా జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో పాటు జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Nitish Kumar Reddy
అఫ్గానిస్థాన్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో కూడా నితీశ్ గాయం కారణంగా రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. మూడో వన్డేలో తిరిగి ఆడినప్పటికీ, గాయం పూర్తిగా నయంకాకపోవడంతో ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
హార్దిక్ పాండ్యా కూడా గాయం కారణంగా అందుబాటులో లేడు. దీంతో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డిపై టీమిండియా జట్టు మేనేజ్‌మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. నితీష్ కూడా దూరం కావడంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీసీఐ త్వరలోనే రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.