Reading Time: 2 minutes
Kylian Mbappe Scores Brace As France Beat Iraq 3 0 Qualify For Fifa World Cup 2026 Knockouts

Kylian Mbappe: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఫిలడెల్ఫియాలో జరిగిన గ్రూప్-I మ్యాచ్‌లో ఇరాక్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ స్టార్ ఫార్వర్డ్ కైలియన్ ఎంబాప్పే (Kylian Mbappe) తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ను రెండు గోల్స్‌తో చిరస్మరణీయంగా మలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనకు ‘సుపీరియర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా లభించింది.

మ్యాచ్ మొదటి నుంచే ఫ్రాన్స్ ఆధిపత్యం కనపరిచింది. 14వ నిమిషంలో మైఖేల్ ఒలిసే అందించిన అద్భుత పాస్‌ను అందుకున్న ఎంబాప్పే, డిఫెండర్‌ ను దాటుకుని బలమైన షాట్‌తో తొలి గోల్ నమోదు చేశాడు. దీంతో ఫ్రాన్స్‌కు 1-0 ఆధిక్యం దక్కింది. మొదటి అర్ధభాగం మొత్తం ఫ్రాన్స్ బంతిని ఎక్కువసేపు నియంత్రించగా.. ఇరాక్ ఒక్కసారి కూడా గోల్‌ పోస్ట్‌ ను లక్ష్యంగా చేసుకుని షాట్ చేయలేకపోయింది.

అయితే హాఫ్‌ టైమ్ తర్వాత ఫిలడెల్ఫియాలో భారీ వర్షం, పిడుగులు పడటంతో మ్యాచ్‌కు సుదీర్ఘ అంతరాయం ఏర్పడింది. ఫిఫా వాతావరణ భద్రతా నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, అధికారులు, ప్రేక్షకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పిడుగుల ప్రభావం కొనసాగడంతో మ్యాచ్ దాదాపు 130 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో 2026 ప్రపంచకప్‌లో తొలి వాతావరణ సంబంధిత అంతరాయంగా ఈ మ్యాచ్ నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత రెండో అర్ధభాగం ప్రారంభమైనా ఫ్రాన్స్ జోరు ఏమాత్రం తగ్గలేదు. 54వ నిమిషంలో ఉస్మాన్ డెంబెలే అందించిన పాస్‌ను గోల్‌గా మలిచిన ఎంబాప్పే తన రెండో గోల్ నమోదు చేశాడు. ఈ గోల్‌తో అతని ప్రపంచకప్ కెరీర్ గోల్స్ సంఖ్య 16కు చేరుకుంది.

66వ నిమిషంలో డెంబెలే మరో గోల్ సాధించి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో ఇరాక్ తిరిగి పోటీలోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. గణాంకాల పరంగా కూడా ఫ్రాన్స్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. 56% బంతి నియంత్రణ, 19 షాట్లు, 91% పాస్ ఖచ్చితత్వంతో ప్రత్యర్థిని ఒత్తిడిలో ఉంచింది. మరోవైపు ఇరాక్ కేవలం నాలుగు షాట్లకే పరిమితమై, ఒక్క షాట్ కూడా లక్ష్యంపై వేయలేకపోయింది.

ఈ విజయంతో ఫ్రాన్స్ రెండు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించి గ్రూప్-Iలో అగ్రస్థానానికి చేరుకుంది. అలాగే నాకౌట్ దశలో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇక ఇరాక్ రెండు పరాజయాలతో పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. నాకౌట్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో సెనెగల్‌పై తప్పనిసరిగా విజయం సాధించాలి.