
హైదరాబాద్ సిటీకి ప్రధాన తాగునీటి వనరులైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు క్రమంగా నిండుతున్నాయి. గత రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెండు రిజర్వాయర్ల నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది.
హిమాయత్‌సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.25 అడుగులకు చేరుకుంది. కేవలం ఒక అడుగు మేర నీరు చేరితే గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం కొనసాగితే నీటిని నియంత్రితంగా విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
మరోవైపు గండిపేటలోని ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1784 అడుగుల వద్ద ఉంది. పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
జంట జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరగడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీటి ప్రవాహం, గేట్ల నిర్వహణపై అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.