
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ (TMC) తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించారు. దీదీ స్థానంలో టీఎంసీ కొత్త చైర్‌పర్సన్‌గా హౌరా సెంట్రల్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో పాటు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఎంసీ శాసనసభా పక్షం రెండుగా చీలిన విషయం తెలిసిందే. రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో సోమవారం (జూన్ 22) టీఎంసీ తిరుగుబాటు వర్గం ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
►ALSO READ | ఖతార్‌లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 13 సజీవ దహనం.. 66 మందికి గాయాలు
దాదాపు 60 మంది రెబల్ ఎమ్మెల్యేలు, 70 మంది కౌన్సిలర్లు హాజరైన ఈ సమావేశంలో తిరుగుబాటు వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని పార్టీ చైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించి.. ఆమె స్థానంలో సీనియర్ లీడర్ అరూప్ రాయ్‌ను కొత్త చైర్‌పర్సన్‌గా ఎంపిక చేస్తూ రెబల్ వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
TMC కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటు:
తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకున్న తిరుగుబాటు వర్గం పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగానే పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ లీడర్స్ ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్, రథిన్ ఘోష్, సబినా యాస్మిన్ టీఎంసీ వైస్ చైర్‌పర్సన్లుగా నియమించింది. 2022, ఫిబ్రవరి తర్వాత టీఎంసీ జాతీయ కార్యవర్గాన్ని పునరుద్ధరించలేదని.. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తిరుగుబాటు నేతలు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వరుస షాకులతో సతమతమవుతోన్న మమతా బెనర్జీకి ఇది మరో భారీ ఎదురు దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.