Reading Time: 2 minutes

40 డిగ్రీల ఎండలకే అల్లాడిపోతున్న యూరప్.. ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్ జారీ

Caption of Image.

భూగోళం నిప్పుల కొలిమిలా మారుతోంది. సాధారణంగా చల్లటి వాతావరణానికి పేరొందిన యూరప్ ఖండం ఇప్పుడు భానుడి భగభగలకు విలవిలలాడిపోతోంది. కనుచూపు మేరలో పచ్చటి ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాల్సిన లండన్, పారిస్, రోమ్ వంటి నగరాల వీధులు ఇప్పుడు మనుషులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండోసారి ‘హీట్ డోమ్’ ఏర్పడటంతో యూరప్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి.

ఖాళీగా నగర వీధులు..
ఫ్రాన్స్‌లోని తౌలౌస్ వంటి నగరాల్లో జూన్ 22 నాటికే రోడ్లన్నీ పూర్తిగా ఖాళీ అయిపోయాయి. దేశ చరిత్రలోనే ఇది అత్యంత వేడి రోజుగా రికార్డు సృష్టించేలా ఉందని అక్కడి వాతావరణ సంస్థ ‘మెటియో ఫ్రాన్స్’ ప్రకటించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి పలు దేశాలు’రెడ్ వెదర్ అలర్ట్’ జారీ చేశాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ ఉష్ణోగ్రత 40 డిగ్రీల మార్కును దాటి దూసుకుపోతోంది. 1980ల నుంచి ప్రపంచ సగటు కంటే రెండింతల వేగంతో వేడెక్కుతున్న యూరప్ ఖండం.. ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

బ్రిటన్ చరిత్రలోనే రికార్డు..
ఈ తీవ్రమైన వాతావరణ మార్పుల ధాటికి యూకే మెట్ ఆఫీస్ చరిత్రలోనే అరుదైన రెడ్ ఎక్స్‌ట్రీమ్ హీట్ వార్నింగ్‌ను జారీ చేసింది. జూన్ నెలలో బ్రిటన్ చరిత్రలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత రికార్డులు ఈ దెబ్బకు బద్దలయ్యేలా ఉన్నాయి. ఈ వారం ఉష్ణోగ్రతలు కనీసం 39 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని.. రాత్రి వేళల్లో కూడా కనీసం 20 డిగ్రీల కంటే కిందకు తగ్గవని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం వృద్ధులు, రోగులు మాత్రమే కాకుండా.. సాధారణ ఆరోగ్యవంతులపై కూడా ఈ ఉష్ణోగ్రతలు తీవ్రమైన ప్రభావం చూపుతాయని, ప్రజలు తమ రోజువారీ జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

►ALSO READ | ఇరాన్‌‌లో 3 వేల మంది అరెస్టు… యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ కు సాయం చేశారని ఆరోపణలు

ఫ్రాన్స్‌లో మరణాల మృదంగం..
ఫ్రాన్స్‌లో ఈ తీవ్రమైన ఎండల దెబ్బకు ఇప్పటికే కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. నైరుతి ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ నగరంలో ఉష్ణోగ్రత ఏకంగా 42 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఫ్రాన్స్ ప్రభుత్వం వందలాది పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. దేశంలోని 54 ప్రాంతీయ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాలను రెడ్ అలర్ట్ పరిధిలోకి తెచ్చారు. చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రాంతాలను రెడ్ అలర్ట్ పరిధిలోకి తీసుకురావడం ఇదే తొలిసారి. ప్రజలకు అవసరమైన వైద్య సహాయం అందించడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి. ఎండలో పనిచేసే కార్మికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

క్లైమేట్ చేంజ్ శాపం.. శాస్త్రవేత్తల హెచ్చరిక
వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. మనం వాడుతున్న బొగ్గు, ఆయిల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వల్లే ఈ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. భూమి తన్ను తాను చల్లబరచుకునే శక్తిని కోల్పోతోందని.. అందుకే ఈ వేడి గాలులు ఇంత తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల వాతావరణం మరింత నీటిని ఆవిరి చేస్తోందని.. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన కరవు పరిస్థితులతో పాటు, అకస్మాత్తుగా ఊహించని భారీ వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని రీడింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిచర్డ్ అల్లాన్ హెచ్చరించారు. కంటికి కనిపించని ఈ వాతావరణ ముప్పు యూరప్ దేశాలను ఇప్పుడు భయపెడుతోంది.

©️ VIL Media Pvt Ltd.