Reading Time: < 1 minute
Ci Nagaraju Questioned For 8 Hours In Sai Krishna Murder Case Sit Prepares Remand Report

CI Nagaraju Questioned for 8 Hours in Sai Krishna Murder Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టైన సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుమారు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. సిట్ విచారణకు సీఐ ఏమాత్రం సహకరించలేదట. విచారణ అనంతరం నాగరాజును వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సిట్ విచారణలో ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్‌లు, కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాల తారుమారు అంశాలపై సీఐ నాగరాజును సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే సిట్ బృందం అడిగిన ప్రశ్నలకు నాగరాజు సహకరించలేదని, పలువురు అంశాలపై మౌనం పాటించినట్లు తెలుస్తోంది. దీంతో రిమాండ్ అనంతరం కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరింత లోతుగా విచారించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. నాగరాజు అరెస్టు నేపథ్యంలో అతని మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవాడ ప్రభుత్వాసుపత్రి, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం సీఐ నాగరాజును న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య అతడిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయికృష్ణ హత్య కేసులో నాగరాజు పాత్రపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సిట్ దర్యాప్తు మరింత కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో కస్టడీ విచారణకు అనుమతి లభిస్తే కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.