
బెంగళూరు: బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తల్లితండ్రి, చెల్లిని చంపేసిన శ్వేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను విచారించగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లిపై విపరీతమైన ద్వేషం పెంచుకుని శ్వేత ఈ ఘాతుకానికి పాల్పడిందని విచారణలో వెల్లడైంది.
“మా అమ్మ మాకు దక్కాల్సిన స్వేచ్ఛను ఎప్పుడూ ఇవ్వలేదు. హైస్కూల్ రోజుల నుంచి ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు నేను ఒక ఖైదీలా బతికాను. నా స్నేహితులు, తోటి విద్యార్థులు తరచుగా నన్ను ఏడిపించేవారు.. నా పరిస్థితి చూసి జాలిపడేవారు కూడా. నేను ఒక అనాథలా బతికాను. ఈ కారణాల వల్ల నాకు మా అమ్మ మీద ద్వేషం కలిగింది” అని శ్వేత పోలీసులకు చెప్పింది.
న్యూ హొరైజన్ కాలేజీలో బీ.టెక్ చదువుతున్నప్పుడు శ్వేత, కెన్నెత్ ప్రేమలో పడ్డారు. బీ.టెక్ పూర్తి చేశాక, ఇద్దరూ ఉద్యోగాల్లో చేరి సహజీవనం చేశారు. కొన్ని కారణాల వల్ల, ఇద్దరూ తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేశారు. సొంతంగా బిజినెస్ ప్లాన్ చేసుకుని.. తమ తల్లిదండ్రుల పేరు మీద HDFC బ్యాంక్ నుంచి రూ. 30 లక్షల లోన్ తీసుకున్నారు. రూ. 30 లక్షల రుణంపై వడ్డీతో సహా ఏమీ చెల్లించకపోవడంతో, వారి తల్లిదండ్రులకు బ్యాంకు నోటీసులు పంపింది.
బ్యాంకు నుంచి నోటీసు వచ్చేంత వరకూ.. శ్వేత, కెన్నెత్ లోన్ తీసుకున్న విషయం శ్వేత తల్లిదండ్రులకు తెలియదు. బ్యాంకు నుంచి నోటీసు వచ్చినప్పుడు, తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, కెన్నెత్ ఇంటికి వెళ్లి అతనిని, అతని కుటుంబ సభ్యులను శ్వేత ఫ్యామిలీ ప్రశ్నించింది. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. నిందితుడు కెన్నెత్ సహజీవనం చేస్తున్న విషయం అతని తల్లిదండ్రులకు కూడా తెలియదు. కెన్నెత్ తండ్రి హెచ్‌ఏఎల్ (HAL)లో ఉద్యోగి.
తల్లిదండ్రులు కూడా కెన్నెత్ చేసిన నిర్వాకానికి నిందించడంతో కెన్నెత్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ విషయంలో జరిగిన గొడవ కారణంగానే.. శ్వేత, కెన్నెత్ కలిసి శ్వేత కుటుంబాన్ని హతమార్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది. కెన్నెత్ నిస్సహాయ స్థితిలో చూస్తుండగా.. ముగ్గురినీ తానే చంపానని శ్వేత చెబుతుండగా పోలీసులు ఆమెతో విభేదించారు. ఎందుకంటే.. ముగ్గురి శరీరంపై దాదాపు 30 కత్తిపోట్లు ఉన్నాయి. శ్వేత మాత్రమే ఇంత క్రూరంగా చంపి ఉంటుందని పోలీసులు భావించడం లేదు. కెన్నెత్, శ్వేత ఇద్దరూ కలిసి ఈ హత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
మంగళవారం శ్వేత, కెన్నెత్ కలిసి ఇంటికి శ్వేత ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో శ్వేత తల్లి ముత్తులక్ష్మి ఒక్కరే ఉన్నారు. డబ్బు తిరిగి చెల్లించే విషయంపై తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగి, ఆపై గొడవ జరిగింది. ఆ కోపంలో శ్వేత ఇంట్లోని పెద్ద కత్తితో తల్లిపై దాడి చేసి చంపేసింది. అనంతరం ఇంట్లోని రక్తపు మరకలు కడగడం పూర్తయ్యే సమయానికి తండ్రి సోమసుందర్, చెల్లి సుప్రియ(20) ఇంటికి చేరుకున్నారు.
ముందుగా ఇంట్లోకి వచ్చిన సుప్రియను శ్వేత గట్టిగా పట్టుకోగా.. కెన్నెత్ కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆపై సోమసుందర్‌పైనా అదే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆయన బయటకు పరిగెత్తి సాయం కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత శ్వేత, కెన్నెత్ అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు శ్వేతను పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. కెన్నెత్ కోసం గాలిస్తున్నారు.