
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక అందమైన ప్యాలెస్.. ఘనంగా పెళ్లి ఏర్పాట్లు.. మరికొద్ది నెలల్లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనే బోలెడన్ని ఆశలు.. కానీ, అంతలోనే అంతా తలకిందులైపోయింది. టూర్‌కి వెళ్లిన చోట కాలుజారి లోయలో పడిపోయాడనుకున్న 26 ఏళ్ల యువకుడి మరణం వెనుక.. నమ్మిన కాబోయే భార్యే కాలయముడిగా మారిందనే భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. పూణే జిల్లాలోని లోహగడ్ కోట సాక్షిగా జరిగిన ఈ విషాద గాథ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
అసలేం జరిగింది?
పూణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు కేతన్ అగర్వాల్ (26).. తో సియా గోయల్ అనే యువతితో అతని పెళ్లి జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే జూన్ 18న కేతన్ తన కాబోయే భార్య, స్నేహితులతో కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అక్కడ ఫోటోలు దిగుతుండగా బలమైన గాలుల వల్ల కేతన్ కాలుజారి 400 అడుగుల లోయలో పడిపోయాడని సియా గోయల్ పోలీసులకు చెప్పింది. పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే భావించారు.
కళ్లు చెదిరే ట్విస్ట్
కానీ, పోలీసులు లోతుగా విచారించడంతో అసలు నిజం బయటపడింది. సియా గోయల్‌కు చేతన్ బాబులాల్ (22) అనే మరో యువకుడితో అఫైర్ ఉంది. కేతన్‌ను వదిలించుకోవడానికి వీరిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. పక్కా స్కెచ్‌తో కేతన్‌ను కోట పైకి తీసుకెళ్లి, వెనుక నుంచి లోయలోకి నెట్టేసి హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొడుకు శవమై రావడంతో కేతన్ కుటుంబం గుండె బరువెక్కింది. చాలా మంచివాడు, ఎవరికీ కూడా చెడు చేయాలనీ అనుకోని వాడు.. అతనికి ఇలా జరగకూడదు అంటూ అతని స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సోషల్ మీడియాలో కన్‌ఫ్యూజన్
ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా Xలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఈ కేసులో చనిపోయిన కేతన్ అగర్వాల్.. సంచలనం సృష్టించిన ‘పూణే పోర్షే కార్ ప్రమాద’ కేసులోని మైనర్ నిందితుడికి సొంత అన్న అంటూ కొందరు పోస్టులు పెట్టారు.
కానీ అసలు నిజం ఏంటంటే
పోర్షే కేసు నిందితుడి తండ్రి పేరు, ఈ కేసులో చనిపోయిన కేతన్ తండ్రి పేరు.. కూడా విశాల్ అగర్వాల్ కావడం వల్ల ఈ గందరగోళం మొదలైంది. ఇద్దరిదీ పూణే నగరమే, పైగా ఇద్దరి కుటుంబాలూ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగంలోనే ఉండటంతో గూగుల్ సెర్చ్‌లో పేర్లు ఒకేలా కనిపించాయి.
ALSO READ : కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా
దీంతో మొదట పొరపాటు పడి ఎమోషనల్ పోస్టులు పెట్టిన నెటిజన్లు.. ఆ తర్వాత వాస్తవం తెలుసుకుని, వీరిద్దరూ వేర్వేరు కుటుంబాలకు చెందినవారని, కేతన్ అగర్వాల్‌కు పోర్షే ప్రమాద నిందితుడితో ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇస్తున్నారు.
ఒకవైపు నమ్మిన అమ్మాయి చేసిన మోసం, ఇంకోవైపు సోషల్ మీడియా తొందరపాటు.. కేతన్ అగర్వాల్ మరణం ఒక తీరని విషాదంగా మిగిలిపోయింది.