
- వచ్చే నెల 6న ఫ్యాకల్టీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
- అదే రోజు అప్లికేషన్లకు చివరి గడువు
- ఇప్పటికే డిప్యుటేషన్ ద్వారా కొన్ని పోస్టుల భర్తీ
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) లో పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 189 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
వీటిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలకు చెందిన డాక్టర్లు, ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన టెక్నీషియన్లు, ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఈ నియామకాలు ఏడాది కాలానికి లేదా రెగ్యులర్ రిక్రూట్ మెంట్ జరిగే వరకు తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే డిప్యుటేషన్ , రీ డిప్లాయ్‌మెంట్ ద్వారా టీచింగ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీ ల నుంచి కొంతమందిని ప్రభుత్వం భర్తీ చేసింది.
31 మంది ఫ్యాకల్టీ..
మొదటి నోటిఫికేషన్ ద్వారా మొత్తం 31 ఫ్యాకల్టీ పోస్టులను నిమ్స్ భర్తీ చేస్తోంది. ఇందులో 5 ప్రొఫెసర్, 2 అసోసియేట్ ప్రొఫెసర్, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. కార్డియాలజీ, సీటీవీఎస్, నెఫ్రాలజీ, యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి స్పెషాలిటీ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన ప్రొఫెసర్లకు నెలకు రూ. 2,20,000, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ. 1,88,000, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ. 1,42,506 చొప్పున వేతనం అందించనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ నిబంధనలు వర్తించనున్నాయి. ఈ పోస్టులకు జులై 6వ తేదీ ఉదయం 9 గంటలకు నిమ్స్ పాత భవనంలోని బోర్డ్ రూమ్‌లో నేరుగా వాక్- ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 122 కొలువులు..
ఆస్పత్రి రోజువారీ సేవల కోసం మరో నోటిఫికేషన్ ద్వారా 122 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో 98 టెక్నీషియన్ పోస్టులతో పాటు 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ (34), అనస్థీషియా టెక్నీషియన్ (20), ఎక్స్-రే (10), ఈసీజీ, బ్లడ్ బ్యాంక్, ఎంఆర్ఐ వంటి విభాగాల్లో టెక్నీషియన్లకు నెలకు రూ. 32,500 వేతనం ఫిక్స్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో అసిస్టెంట్ పీఆర్‌వో, స్టాటిస్టీషియన్, డిప్యూటీ రిజిస్ట్రార్, అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటికి పోస్టును బట్టి రూ.35 వేల నుంచి రూ. 80 వేల వరకు వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆఫీసర్లు, ఇంజనీర్లు..
మరో నోటిఫికేషన్ ద్వారా 36 రకాల ఆఫీసర్ స్థాయి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో లీగల్ ఆఫీసర్ (1), చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (1), సెక్యూరిటీ ఆఫీసర్ (4), సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (4), హార్డ్‌వేర్ ఇంజనీర్(4), బయో మెడికల్ ఇంజనీర్ (1), సివిల్ మరియు ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, ఫైర్ ఆఫీసర్లు, పెర్ఫ్యూజనిస్ట్ (8), ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ వంటి పోస్టులు ఉన్నాయి. సెక్యూరిటీ విభాగంలో రిటైర్డ్ పోలీస్ లేదా మిలిటరీ అధికారులకు ప్రాధాన్యత ఉంటుంది. ఐటీ విభాగంలో మెర్న్ స్టాక్, జావా వంటి నైపుణ్యాలు ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అప్లికేషన్లను పరిశీలించి, మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూ నిర్వహించి, స్కిల్ టెస్ట్ ద్వారా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు ఇలా..
అర్హులైన అభ్యర్థులు నిమ్స్ అధికారిక వెబ్‌సైట్ www.nims.edu.in నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నింపిన అప్లికేషన్లతో పాటు విద్యార్హత, అనుభవ ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి జులై 6వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిమ్స్, పంజగుట్ట కార్యాలయంలో అందజేయాలి. ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు రుసుము రూ. 2,000 (ఎస్సీ, ఎస్టీలకు రూ.1,000), ఇతర అన్ని పోస్టులకు రూ.1,000 (ఎస్సీ,ఎస్టీలకు రూ. 500)గా నిర్ణయించారు.
ఈ మొత్తాన్ని డైరెక్టర్, నిమ్స్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది. అన్ని విభాగాల్లో మహిళలకు 33.3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతాయి. వయోపరిమితి పోస్టును బట్టి 35 నుంచి 58 ఏండ్ల వరకు ఉండగా, రిజర్వ్‌డ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఎంపికైన వారు సనత్ నగర్ టిమ్స్ లో సేవలందించాల్సి ఉంటుంది. తాత్కాలిక పద్ధతిన చేపట్టే ఈ నియామకాలను రెగ్యులర్ సర్వీసుగా పరిగణించబోమని నిమ్స్ స్పష్టం చేసింది.