Reading Time: < 1 minute

ప్రేమ పెళ్లి చేసుకుని ఏడు నెలల పిల్లాడితో తిరిగొచ్చిన కూతురు.. అల్లుడిని కొట్టి చంపేశారు !

Caption of Image.

హర్దోయ్: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. తమ కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంతో అల్లుడిని కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తిని వివేక్ కనౌజియాగా పోలీసులు గుర్తించారు. అతని వయసు 28 సంవత్సరాలు. ఈ ఘటన హర్దోయ్‌లోని బద్రుద్దీన్‌పూర్ గ్రామంలో జరిగింది. ఆటో డ్రైవర్ అయిన వివేక్, ఇరు కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా 2024 మే నెలలో పూనమ్‌ను పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత, బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో భయపడిన ఈ ప్రేమ జంట ఢిల్లీ సమీపంలోని నోయిడాకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. వివేక్, పూనమ్ జంటకు ఏడు నెలల క్రితం బాబు పుట్టాడు. దీంతో.. వివేక్ తన భార్య, ఏడు నెలల కొడుకుతో కలిసి తన సొంత గ్రామానికి తిరిగి వెళ్లాడు. ఈ భార్యాభర్త పిల్లాడితో కలిసి సొంతూరు తిరిగి వెళ్లిన విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. పూనమ్ కుటుంబం పగ చల్లారకపోవడంతో సోమవారం సాయంత్రం పూనమ్ కుటుంబ సభ్యులు వివేక్, పూనమ్ ఉంటున్న ఇంటికి వెళ్లారు. భార్యాభర్తతో గొడవ పెట్టుకున్నారు.

పూనమ్ తండ్రి, మామ, సోదరులు కర్రలు, లాఠీలతో వివేక్‌పై దాడి చేశారు. ఈ గొడవ హింసాత్మకంగా మారింది. దాడి జరుగుతున్న సమయంలో పూనమ్ తప్పించుకుని తనను తాను రక్షించుకోవడానికి ఏడు నెలల పిల్లాడిని తీసుకుని పక్కింట్లోకి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వివేక్‌ను చికిత్స కోసం వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. 

పక్కింట్లోకి వెళ్లి తన భర్తను కొడుతున్నారని పోలీసులకు పూనమ్ సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పాట్కు చేరుకునే సరికి పూనమ్ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. వివేక్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే వివేక్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వివేక్ తల్లి విమల ఫిర్యాదుతో పోలీసులు ఏడుగురు నిందితులపై హత్యతో సహా పలు తీవ్రమైన అభియోగాలతో కేసు నమోదు చేశారు.

©️ VIL Media Pvt Ltd.