Reading Time: < 1 minute
Ysrcp Mlc Anantha Babu Bail And Special Facilities Petitions Verdict On June 29

Anantha Babu Case: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్లపై రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. జైల్లో ఉన్న సమయంలో ఇంటి నుంచి భోజనం అందించడంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ అనంతబాబు కోర్టును ఆశ్రయించారు. విచారణ నిమిత్తం అనంతబాబును పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను జైలు అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షల వివరాలను న్యాయమూర్తి పరిశీలించారు.

ఇక, వెన్నుపూస, మెడ సంబంధిత ఆరోగ్య సమస్యలపై సమర్పించిన నివేదికలను పరిశీలించిన కోర్టు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడితో కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. సంబంధిత నిపుణులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేరని అధికారులు కోర్టుకు తెలియజేశారు. పూర్తి వైద్య నివేదిక అందిన తర్వాత ఇంటి భోజనం, ఇతర ప్రత్యేక సదుపాయాల అంశంపై నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇదే సమయంలో సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా కోర్టు విచారణ చేపట్టింది. అనంతబాబుకు నేరచరిత్ర ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల భద్రతకు, కేసు విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతబాబు బెయిల్ పిటిషన్‌తో పాటు ప్రత్యేక సదుపాయాల పిటిషన్‌పై ఈ నెల 29న తీర్పు వెలువరించనున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది.