Reading Time: 2 minutes
Shankh Mitra Second Highest Paid Ceo After Elon Musk Welltower Indian Origin

భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ వ్యాపారవేత్త శంఖ్ మిత్రా ప్రపంచ కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారారు. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REIT) సంస్థ వెల్‌టవర్ (Welltower) సీఈఓగా ఉన్న ఆయన.. 2025లో 821 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లకు పైగా) విలువైన భారీ పారితోషికాన్ని అందుకున్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందిన సీఈఓల జాబితాలో ఎలాన్ మస్క్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు.

40 శాతం పెరిగిన పారితోషికం

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. శంఖ్ మిత్రా పారితోషికం గతంతో పోలిస్తే 40 శాతం పెరిగి 821 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో దాదాపు 99 శాతం స్టాక్ గ్రాంట్ల రూపంలోనే ఉంది. 2025 అక్టోబర్‌లో మాత్రమే ఆయనకు 789 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు కేటాయించినట్లు వెల్లడైంది. అయితే ఈ మొత్తం వెంటనే ఆయన చేతికి రాదు. ఒప్పందం ప్రకారం.. కేటాయించిన షేర్లలో సగం 2031 వరకు సంస్థలో కొనసాగితేనే లభిస్తాయి. మిగిలిన సగం షేర్లు వెల్‌టవర్ మార్కెట్ విలువ 45 శాతం పెరగడం, కంపెనీ షేర్లు ప్రధాన స్టాక్ సూచీలను అధిగమించడం వంటి పనితీరు లక్ష్యాలను సాధించిన తర్వాతే అందుతాయి.

భారత్‌లో చదువు.. అమెరికాలో కెరీర్

శంఖ్ మిత్రా భారత్‌లో జన్మించి విద్యాభ్యాసం పూర్తి చేశారు. కోల్‌కతాలోని ప్రముఖ జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం అమెరికాకు వెళ్లి కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి అప్లైడ్ వాల్యూ ఇన్వెస్టింగ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. తన కెరీర్ ప్రారంభంలో ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC) సంస్థలో ఐదేళ్లకు పైగా పనిచేశారు. అనంతరం ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటాడెల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్, మిలీనియం పార్ట్నర్స్ వంటి ప్రముఖ సంస్థల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో నిర్వహణ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

వెల్‌టవర్‌లో ఎదుగుదల

2016లో వెల్‌టవర్ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన శంఖ్ మిత్రా.. పెట్టుబడుల విభాగాధిపతి, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వంటి కీలక పదవులు చేపట్టారు. 2020 అక్టోబర్‌లో సంస్థ సీఈఓగా నియమితులయ్యారు. డేటా ఆధారిత పెట్టుబడి వ్యూహాలు, వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా సంస్థను వేగంగా అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం అమెరికాలో లిస్టెడ్ ప్రధాన REIT సంస్థకు నాయకత్వం వహిస్తున్న కొద్ది మంది భారతీయ మూలాల సీఈఓల్లో శంఖ్ మిత్రా ఒకరిగా నిలిచారు. ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయ ప్రతిభ మరోసారి చాటిచెప్పిన శంఖ్ మిత్రా విజయం.. యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.