
ఆంధ్రప్రదేశ్ రాష్ట చరిత్రలో సువర్ణాధ్యాయం. ఏపీలో తొలి బంగారు గని ప్రారంభమైంది. ఆ సువర్ణ అధ్యాయానికి రతనాల సీమ రాయలసీమ కేంద్రమైంది.. శతాబ్దాల చరిత్ర గల కర్నూల్ జిల్లాలోని జొన్నగిరి.. ఏపీని స్వర్ణాంధ్రగా మార్చే సువర్ణగిరి అయింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ..“ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైంది.. రాయలసీమను మళ్లీ రతనాల సీమగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగు” అన్నారు. ఒకప్పుడు ‘సువర్ణగిరి’గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం బంగారం, రత్నాల వైభవానికి నిలయమని గుర్తు చేశారు.
రూ.405 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటైన ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఏడాదికి ఒక టన్ను బంగారం ఉత్పత్తి లక్ష్యంగా ఈ గని పనిచేయనుండగా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ప్రాంత అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని తెలిపారు.
జొన్నగిరి పేరును ‘స్వర్ణగిరి’గా మార్చాలని ప్రతిపాదించిన సీఎం, భవిష్యత్తులో ఇక్కడే జ్యువెలరీ పార్కు ఏర్పాటు చేసి విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ మాత్రమే కాదు, రత్నగర్భ అని పేర్కొంటూ రాష్ట్ర ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు.