
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించింది. దాదాపు 2 నిమిషాల పాటు పాక్ గగనతలంలో చక్కర్లు కొట్టి ఆ తర్వాత తిరిగి వచ్చింది. ఈ ఘటన 2026, జూన్ 22వ తేదీన జరిగింది. ఎయిర్ ఇండియా సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..?
జూన్ 22వ తేదీన ఎయిర్ ఇండియాకు చెందిన AI479 విమానం ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు టేకాఫ్ అయ్యింది. అయితే, అమృత్‌సర్ రీచ్ అయ్యాక విమానశ్రయంలో తీవ్రమైన ఎయిర్ ట్రాఫిక్ కారణంగా ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతించలేదు. దీంతో విమానం గో-అరౌండ్ (మళ్లీ గాల్లోకి ఎగరడం) చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే విమానం అటారీ సమీపంలో పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది.
దాదాపు రెండు నిమిషాల పాటు పాక్ గగనతలంలో చక్కర్లు కొట్టింది. పాకిస్థాన్‌కు చెందిన లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వెంటనే ఈ విమాన గమనాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో.. పైలట్ యు-టర్న్ తీసుకుని తిరిగి భారత గగనతలంలోకి సురక్షితంగా ప్రవేశించారు. అప్పటికీ కూడా అమృత్ సర్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
ఈ ఘటనను ఎయిర్ ఇండియా ధృవీకరించింది. జూన్ 22న ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వెళ్తున్న AI479 విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో గో-అరౌండ్ చేస్తోన్న క్రమంలో పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ విషయాన్ని డీజీసీఏకు తెలియజేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించామని.. విచారణ పూర్తయ్యే వరకు సదరు పైలట్‌ను విధుల నుంచి తప్పించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.