Reading Time: < 1 minute
Why Pakistan Is Highlighting Indus Valley Civilisation Amid Indus Waters Treaty Dispute984567

Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు సింధూ, దాని ఉపనదుల నీటిని వాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్‌కు ‘‘సింధూ నది జలాల ఒప్పందం’’ను నిలిపేయడం ద్వారా భారత్ షాక్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు నీటి కోసం పాకిస్తాన్ కొత్త పథకాన్ని వేస్తోంది. తన ప్రాచీన చరిత్రను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు ఇస్లామిక్ చరిత్రను తమ జాతీయ గుర్తింపుగా మార్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ‘‘సింధు లోయ నాగరికత’’ను ముందుకు తీసుకువస్తోంది. మొహెంజోదారో, హరప్పా, తక్షశిల, గాంధార వంటి ప్రాచీన వారసత్వ కేంద్రాలను ప్రచారం చేస్తోంది. క్రీ.శ. 712లో ముహమ్మద్ బిన్ ఖాసిం జరిపిన సింధ్ విజయంతోనే తమ చరిత్ర మొదలైందని ఏళ్ల తరబడి విద్యార్థులకు బోధించిన పాకిస్థాన్, ఇప్పుడు సింధు లోయ నాగరికతను ముందుకు తెస్తోంది.

ఇటీవల, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. సింధూ నదిపై పాకిస్తాన్‌కు చారిత్రక హక్కు ఉందని ప్రకటించారు. మొహెంజోదారో, హరప్పా వంటి సింధూ నాగరికత కేంద్రాలు పాక్‌లో ఉన్నందున, ఆ నాగరికతనకు తామే నిజమైన వారసులమని చెప్పాడు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా సింధూ నాగరికత ప్రాంతాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తోంది. మొహెంజోదారోలో కొత్త తవ్వకాలను చేపట్టింది. తక్షశిల, గాంధార, మెహర్‌గఢ్ వంటి ప్రాచీన ప్రదేశాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తోంది. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కొన్ని నెలలకే, అంటే జూన్ 2025లో ఈ 5,000 ఏళ్ల నాటి నగరంలో తవ్వకాలు మొదలయ్యాయి.

పాక్ చేస్తున్న వాదనల్ని భారత చరిత్రకారులు తిప్పికొడుతున్నారు. పాక్ చేస్తున్న వాదనలు సరికావని అంటున్నారు. సింధు నాగరికతకు చెందిన అనేక ప్రాంతాలు భారత్‌లో కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఘగ్గర్-హక్రా నది పరివాహక ప్రాంతంలో విస్తృతంగా అవశేషాలు లభించాయని చెబుతున్నారు. అందుకే “ఇండస్ వ్యాలీ సివిలైజేషన్” కంటే “ఇండస్-సరస్వతి నాగరికత” అనే పదాన్ని ఉపయోగించాలని భారతీయ నిపుణులు సూచిస్తున్నారు.