Reading Time: 2 minutes
Pakistan Cricket : ప్రాక్టీస్ వదిలేసి భర్తతో కలిసి షికార్లు..  కోచ్, కెప్టెన్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు

Pakistan Cricket : ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టుకు.. ఇప్పుడు మైదానం వెలుపల జరుగుతున్న వివాదాలు, అంతర్గత ముఠా రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారాయి. జట్టులోని ఆటగాళ్ల మధ్య వాతావరణం అస్సలు బాలేదని, డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వివాదాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం పాక్ పరువును బజారున పడేస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరగడానికి ముందు పాకిస్థాన్ జట్టు బస చేసిన హోటల్‌లో ఒక వింత సంఘటన జరిగింది. పాక్ సీనియర్ ప్లేయర్ అలీయా రియాజ్ తన భర్త అలీ యూనిస్‌ను జట్టుకు కేటాయించిన హోటల్ రూమ్‌లో ఉంచుకుంది. దీనిపై పాక్ యువ కెప్టెన్ ఫాతిమా సనా తీవ్రంగా మండిపడింది. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో హోటల్ రూమ్‌లలో బయటి వ్యక్తులకు అనుమతి ఉండదని, క్రమశిక్షణ పాటించాల్సిందేనని ఆమె పట్టుబట్టింది. కెప్టెన్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో అలీయా రియాజ్ భర్త ఆ రూమ్‌ను ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది.

ఈ హోటల్ రూమ్ వివాదం ఇక్కడితో ముగియలేదు. మరుసటి రోజు బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్ ఉండగా, జట్టు సభ్యులందరికీ కఠినమైన ప్రాక్టీస్ సెషన్ షెడ్యూల్ చేశారు. అయితే సీనియర్ ఆటగాడు అలీయా రియాజ్.. టీమ్ ప్రాక్టీస్‌కు రాకుండా, తన భర్తతో కలిసి లండన్ నగరంలో విహారయాత్రకు వెళ్లిపోయింది. క్రీడా స్ఫూర్తిని, జట్టు నియమాలను పక్కనబెట్టి ఒక సీనియర్ ప్లేయర్ ఇలా ప్రవర్తించడం డ్రెస్సింగ్ రూమ్‌లో మరింత అగ్గి రాజేసింది. కెప్టెన్ ఫాతిమా సనా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఆమెను జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.

బంగ్లాదేశ్ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‎ను ఎంపిక చేస్తున్న సమయంలో కెప్టెన్ ఫాతిమా సనా, జట్టు మెంటర్ కమ్ అఫీషియల్ హెడ్ కోచ్ వాహబ్ రియాజ్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. డిసిప్లిన్ లేని అలీయా రియాజ్‌ను జట్టు నుంచి డ్రాప్ చేయాలని ఫాతిమా కోరగా, కోచ్ వాహబ్ మాత్రం ఆమెను ఖచ్చితంగా ఆడించాల్సిందేనని పట్టుబట్టాడు. చివరకు కోచ్ మాటే నెగ్గింది. అయితే ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోయింది, అలీయా రియాజ్ కూడా ఘోరంగా విఫలమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ ఫాతిమా.. జట్టు సభ్యులందరి ముందే కోచ్ వాహబ్ రియాజ్ ముఖంపైనే “నువ్వు డిసిప్లిన్ రూల్స్ పాటించకుండా ఆమెను ఆడించడం వల్లే మనం ఓడిపోయాం, ఈ ఓటమికి నువ్వే బాధ్యుడివి” అని నిలదీసింది.

మరోవైపు పాకిస్థాన్ జట్టు ఆటతీరు వరల్డ్ కప్‌లో అత్యంత పేలవంగా ఉంది. మంగళవారం రాత్రి లీడ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు వరుసగా నాల్గో ఓటమిని చవిచూసింది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఐర్లాండ్, వెస్టిండీస్‌లతో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌లో కూడా పాక్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తాము చెప్పిన ప్లాన్స్‌ను ఆటగాళ్లు మైదానంలో అస్సలు అమలు చేయడం లేదని కోచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. గత ఏడాది శ్రీలంకలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కూడా పాక్ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

పాకిస్థాన్ క్రికెట్‌లో ఇలాంటి గొడవలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పురుషుల జట్టు వన్డే, టీ20 వరల్డ్ కప్‌లలో విఫలమైనప్పుడు కూడా బాబర్ ఆజం జట్టులో ఇలాంటి గ్రూపు గొడవలే బయటపడ్డాయి. పాక్ క్రికెట్ బోర్డు గత 3-4 ఏళ్లలో మహిళల జట్టు కోచ్‌లను నిరంతరం మారుస్తూనే ఉంది. మార్క్ కోల్స్ వంటి విదేశీ కోచ్‌లతో పాటు జునైద్ ఖాన్, బాసిత్ అలీ, సలీమ్ జాఫర్, మొహతాషిమ్ రషీద్ వంటి ఎందరో స్థానిక కోచ్‌లను మార్చినప్పటికీ.. ఆటగాళ్లలో క్రమశిక్షణ, జట్టులో ఐక్యత మాత్రం తీసుకురాలేకపోతున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..