Reading Time: < 1 minute

సింగరేణి బొగ్గు చోరీ జరగలే..ఈ అండ్ ఎం డైరెక్టర్ తిరుమలరావు

Caption of Image.

ఇల్లెందు/టేకులపల్లి, వెలుగు: సింగరేణి సంస్థలో 40 లక్షల టన్నుల బొగ్గు చోరీ జరిగిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ తిరుమలరావు స్పష్టం చేశారు. సోమవారం ఇల్లెందు ఏరియాలో పర్యటించిన ఆయన, జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతి దశ డిజిటల్ పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు. రోడ్డు మార్గంలో రవాణా అయ్యే ప్రతి వాహనంపై ఎస్‌‌‌‌ఏపీ, జీపీఎస్, ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐడీ, జియో ఫెన్సింగ్, ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జిలు, బూమ్ బ్యారియర్లు, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంటుందన్నారు.

అన్ని వేబ్రిడ్జిలు కోల్‌‌‌‌నెట్ డిజిటల్ వ్యవస్థకు అనుసంధానమై ఉండటంతో ప్రతి లారీ, ప్రతి రైల్వే వ్యాగన్ బరువు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు అవుతుందన్నారు. చెక్‌‌‌‌పోస్టులు, సింగరేణి సెక్యూరిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఆకస్మిక తనిఖీలు, హోలోగ్రామ్ చలానాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. భారీ స్థాయిలో చోరీలు జరగడం అసాధ్యమని స్పష్టం చేశారు.

అనంతరం టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఓసీలో తిరుమలరావు పర్యటించారు. వ్యూ పాయింట్ నుంచి గనిలో బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపు, బ్లాస్టింగ్, లోడింగ్, రవాణా పనులను పరిశీలించారు. రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలు, యంత్రాల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

©️ VIL Media Pvt Ltd.