Reading Time: < 1 minute
రాయలసీమలో ‘పసిడి’ పంట.. స్వర్ణగిరిగా మారనున్న జొన్నగిరికి సీఎం చంద్రబాబు శ్రీకారం!

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ఇక దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఒకప్పుడు కరవుతో అల్లాడిని రాయలసీమ ప్రాంతం ఇప్పుడు బంగారం ఉత్పత్తికి కేంద్రంగా మారుతోంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జొన్నగిరిలో ప్రారంభం కానుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (జూన్ 24) ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా రూ.405 కోట్ల పెట్టుబడితో ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. ఇందుకోసం ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని కేటాయించగా, తొలి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రాసెసింగ్ ప్లాంట్లు సిద్ధమయ్యాయి. ట్రయల్ రన్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.

మొదటి ఏడాదిలో 400 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా, వచ్చే ఏడాది నుంచి 900 కిలోల వరకు ఉత్పత్తి పెంచనున్నారు. దశలవారీగా ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరించి ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం వెలికితీయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. బంగారం ఉత్పత్తి విలువలో 4 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో అందనుంది. తొలి ఏడాది 400 కిలోల ఉత్పత్తితో సుమారు రూ.57 కోట్ల ఆదాయం, 900 కిలోల ఉత్పత్తితో దాదాపు రూ.144 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరనుందని అంచనా వేస్తున్నారు.

బుధవారం ఉదయం జొన్నగిరికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు, గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ తొలి యూనిట్‌ను ప్రారంభించడంతో పాటు విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో జొన్నగిరి పేరు దేశవ్యాప్తంగా మారుమోగే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…