Reading Time: 2 minutes

ముంబైలో బీభత్సమైన వర్షం : సిటీ మొత్తం జలమయం.. కొట్టుకుపోయిన రైలు పట్టాలు..

Caption of Image.

ముంబైలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ( జూన్ 24 ) ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షం కారణంగా ముంబై సిటీ, సిటీ శివారు ప్రాంతాలు జలమయమయ్యి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దాదర్ రైల్వే స్టేషన్ లో 5 ప్లాట్ ఫామ్ దగ్గర ట్రాక్ పూర్తిగా నీటమునిగి కొట్టుకుపోయింది.

ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జనం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది వాతావరణ శాఖ. మంగళవారం ఉదయం 8 గంటల నుండి బుధవారం తెల్లవారుజామున 2 గంటల మధ్య ముంబైలో 78 మిల్లీమీటర్లు, తూర్పు శివారు ప్రాంతాల్లో 87 మిల్లీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 113 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది వాతావరణ శాఖ. అత్యధిక వర్షపాతం భాండూప్‌లో నమోదైంది, తెల్లవారుజామున 1 గంట నుండి 2 గంటల మధ్య ఒక గంటలోనే 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం.

 

నవీ ముంబైలోని ఏపీఎంసీ కూరగాయల మార్కెట్ దగ్గర వర్షపు నీరు నిలిచిపోవడంతో సరుకు రవాణా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి వ్యాపారాలు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కుండపోత వర్షం కారణంగా వసాయి-విరార్, నలసోపారా ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది.

నైరుతి రుతుపవనాలు 13 రోజులు ఆలస్యంగా ముంబైలోకి ప్రవేశించాయి. ఈ వర్షాలతో చాలా కాలంగా వేడి ఉక్కపోతతో అల్లాడుతున్న జనం ఉపశమనం పొందారు.మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, వాతావరణ అప్‌డేట్‌లను గమనించాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

©️ VIL Media Pvt Ltd.