Reading Time: 2 minutes
EPFO: పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పులు చేస్తున్నారా..? మీ డబ్బులు మొత్తం కోల్పోయినట్లే..

ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. దీని వల్ల పీఎఫ్ అకౌంట్‌లో గందరగోళం ఏర్పడుతుంది. ఒకే యూఏఎన్ నెంబర్‌పై అనేక కంపెనీల పీఎఫ్ అకౌంట్లు ఉండటం వల్ల మీరు అయోమయానికి గురవుతారు. పీఎఫ్ విత్ డ్రా, బ్యాలెన్స్ చెకింగ్, పెన్షన్ విత్ డ్రా వంటి సమయాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. క్లెయిమ్స్ పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంటుంది. అదే మీరు పీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలో విలీనం చేసుకోవడం వల్ల ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఉండవు. సులువుగా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఎలా విలీనం చేసుకోవాలి..? రెండు యూఏఎన్ నెంబర్లు కలిగి ఉంటే ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు యూఏఎన్ నెంబర్లు ఉన్నాయా..?

రెండు వేర్వేరు యూఏఎన్ నెంబర్లు కలిగి ఉంటే ఏం చేయాలనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈపీఎఫ్‌ను సంప్రదించాలి. ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లి పాత యూఏఎన్ నెంబర్‌ను ఇనాక్టివ్ చేయాలని అభ్యర్ధించండి. దీంతో అధికారులు పరిశీలించి అకౌంట్ ఇనాక్టివ్ చేస్తారు. ఇక ఈపీఎఫ్‌వో ​​హెల్ప్‌డెస్క్‌కు పాత, ప్రస్తుత UAN నంబర్‌లు రెండింటినీ పేర్కొంటూ ఒక ఇమెయిల్ పంపడం ద్వారా దీనిని చేయవచ్చు. పాత యూఏఎన్ అకౌంట్లో ఉన్న నిధులను విత్ డ్రా చేసుకునేందుకు ఉద్యోగులు బదిలీ లేదా ఉపసంహరణ క్లెయిమ్‌ను సమర్పించాలి.

ఉద్యోగం మారితే ఏం చేయాలి..?

తరచుగా ఉద్యోగాలు మారడం వల్ల కొన్నిసార్లు ఒకే యూనివర్సల్ అకౌంట్ నంబర్ కింద ఒకటి కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఏర్పడవచ్చు. కొత్త యజమాని కొత్త ఈపీఎఫ్ ఖాతాను తెరిచినా లేదా ఉద్యోగి ఉన్న ఖాతాను బదిలీ చేయమని అభ్యర్థించడం మరచిపోయినా, ఒకటి కంటే ఎక్కువ ఈపీఎఫ్ ఖాతాలు ఏకకాలంలో ఉండే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ EPF ఖాతాలు కలిగి ఉన్నందుకు ఎటువంటి జరిమానా విధించరు. అయినప్పటికీ నిధుల నిర్వహణ, భవిష్యత్తులో విత్ డ్రా చేసుకునే సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పీఎఫ్ ఖాతాలను విలీనం చేసుకోవాలి. కొత్త కంపెనీల్ చేరినప్పుడు ప్రతి యజమాని ఒక కొత్త మెంబర్ ఐడీని క్రియేట్ చేయవచ్చు. ఉద్యోగి పాత ఖాతా నుండి కొత్త ఖాతాకు బదిలీ అభ్యర్థనను ప్రారంభించకపోతే.. నిధులు వివిధ పీఎఫ్ అకౌంట్లలో ఉంటాయి. ఇవి ఆటోమేటిక్‌గా విలీనం కావు. అందువల్ల ఉద్యోగి ఈపీఎఫ్‌వో ​​పోర్టల్ ద్వారా మాన్యువల్‌గా బ్యాలెన్స్‌లను బదిలీ చేసుకోవాలి.

ఎలా విలీనం చేసుకోవాలి..?

-యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి

-UAN, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాలి

-“ఒక సభ్యుడు-ఒక EPF ఖాతా” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి

– పోర్టల్‌కు UAN, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి

– మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి

-తమ పాత EPF ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి

– వివరాలను సమీక్షించుకుని డిక్లరేషన్‌ను ఆమోదించాలి
-ఆ తర్వాత EPFO ​​ద్వారా బదిలీ ప్రక్రియ ప్రారంభించబడుతుంది