పిల్లల సమగ్ర ఎదుగుదలకు పోషకాలు అధికంగా ఉండే ఆహారం అందించడం ఎంతో ముఖ్యం. అలాంటి హెల్దీ ఫుడ్స్‌లో చేపలు (Fish) మొదటి వరుసలో ఉంటాయి. చేపల్లో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, విటమిన్ డి, కీలకమైన ఖనిజాలు పిల్లల మెదడు పనితీరును, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. అందుకే వైద్యులు కూడా పిల్లల డైట్లో చేపలను చేర్చమని సలహా ఇస్తుంటారు. అయితే, చేపల్లో ఉండే సన్నని ముళ్లు (bones/thorns) ఎక్కడ పిల్లల గొంతులో ఇరుక్కుపోతాయోనని చాలామంది తల్లిదండ్రులు చికెన్, మటన్ ఇచ్చినట్లుగా చేపలను ఇవ్వడానికి భయపడతారు. కానీ మార్కెట్లో ముళ్లు దాదాపుగా లేని, పిల్లలు సులభంగా నమిలి తినగలిగే కొన్ని ప్రత్యేకమైన చేప రకాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం పిల్లలకు సురక్షితమైన ఆ 5 చేపలు ఇవే:
సాల్మన్ (Salmon): ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరోగ్యకరమైన చేపలలో సాల్మన్ ఒకటి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి, కంటి చూపు మెరుగుపడటానికి అద్భుతంగా సహాయపడతాయి. దీని మాంసం చాలా మృదువుగా ఉండి, ముళ్లు అస్సలు ఉండవు.
బాసా (Basa Fish): బాసా చేప మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. దీని రుచి చాలా తేలికగా (mild) ఉండి, మాంసం వెన్నలా కరిగిపోతుంది. ఇందులో ముళ్లు అసలుండవు కాబట్టి చిన్న పిల్లలకు ఫిష్ ఫింగర్స్ లేదా ఫ్రై లాగా చేసి పెట్టడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది ప్రోటీన్‌కు ఒక అద్భుతమైన మూలం. పిల్లలలో కండరాల, శరీర పెరుగుదలకు సహాయపడుతుంది. దీనిని వేపుడు కూరలుగా, లేదా ఫిష్ ఫింగర్స్‌గా సులభంగా తయారు చేసుకోవచ్చు.
పోంఫ్రెట్ (Pomfret – చందమామ చేప): మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన పోంఫ్రెట్ చేపలో మధ్యలో ఒకే ఒక ప్రధానమైన ముల్లు ఉంటుంది. పక్కల ముళ్లు ఉండవు కాబట్టి, మధ్య ముల్లును సులభంగా వేరు చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఇందులో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
కోడ్ (Cod Fish): ఈ తెల్లటి మాంసం కలిగిన చేపలో కూడా ముళ్లు చాలా తక్కువ. మాంసం చాలా మృదువుగా ఉంటుంది. దీని రుచి పెద్దగా ఘాటుగా ఉండదు కాబట్టి, చేపల వాసన నచ్చని పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. ఇందులో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది పిల్లలకు తేలికగా, సులభంగా జీర్ణమయ్యే చేపగా ఉంటుంది. ఇందులో విటమిన్ డి, విటమిన్ బి12, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీనిని పిల్లలకు సూప్‌లలో, ఫిష్ నగ్గెట్స్గా లేదా కాల్చి తినిపించవచ్చు.
తిలాపియా (Tilapia): తిలాపియా చేప బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా ఇందులో సన్నని ముళ్లు ఉండవు. దీని బోన్‌లెస్ ఫిల్లెట్స్ (Boneless fillets) మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. పిల్లలకు అవసరమైన లీన్ ప్రోటీన్ అందించడానికి ఇది మంచి ఎంపిక.





