Reading Time: 2 minutes

అలర్ట్.. మీ అకౌంట్‌లో PF వడ్డీ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

Caption of Image.

EPFO 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని కోట్ల మంది వేతన జీవులకు ఇది ఒక స్థిరమైన, సురక్షితమైన ఆదాయ మార్గంగా నిలిచింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పీఎఫ్ ఖాతాల్లో వార్షిక వడ్డీని జమ చేసే ప్రక్రియను ప్రారంభించడంతో, తమ అకౌంట్లలో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడానికి ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సాధారణంగా ఈపీఎఫ్ వడ్డీని ఏడాదికి ఒకసారి మాత్రమే ఖాతాలో జమ చేసినప్పటికీ.. దీనిని ప్రతి నెలా ఉండే రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగానే లెక్కిస్తారు. వడ్డీ జమ ప్రక్రియ పూర్తయిన తర్వాత, చందాదారులు వివిధ మార్గాల ద్వారా తమ ఖాతా అప్‌డేట్‌లను తనిఖీ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ మెంబర్ ఈ-సేవా పోర్టల్, ఉమాంగ్ మొబైల్ యాప్, మిస్సింగ్ కాల్ సర్వీస్, ఎస్ఎమ్ఎస్ సర్వీస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. దీనితో పాటు అకౌంట్ బ్యాలెన్స్, ఇటీవలి విత్‌డ్రాయల్స్ వివరాలను సులువుగా చూసుకోవడానికి ‘పాస్‌బుక్ లైట్’ అనే సదుపాయాన్ని కూడా ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెచ్చింది.

మీ ఖాతాలో 8.25 శాతం వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడానికి ఈ కింది పద్ధతిని అనుసరించవచ్చు. మొదట ఈపీఎఫ్ఓ అధికారిక మెంబర్ పాస్‌బుక్ పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ మీ 12 అంకెల UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌లను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్‌కు లింక్ అయిన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి. లాగిన్ అయ్యాక వ్యూ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. పాస్‌బుక్ లైట్‌ను ఎంచుకోవాలి. అందులో లేటెస్ట్ ఎంట్రీలను పరిశీలిస్తే వడ్డీ జమ అయిన వివరాలు కనిపిస్తాయి.

వార్షిక వడ్డీతో పాటు, ఉద్యోగులు తమ జీతం నుండి కట్ అవుతున్న నెలవారీ పీఎఫ్ సొమ్ము సకాలంలో డిపాజిట్ అవుతున్నాయో లేదో కూడా క్రమంగా తనిఖీ చేసుకోవాలి. రూల్స్ ప్రకారం కంపెనీలు ఉద్యోగి, యాజమాన్యం వాటాలను ఆయా నెల ముగిసిన 15 రోజుల్లోగా పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. ఒకవేళ జీతంలో కటింగ్స్ జరుగుతున్నా పీఎఫ్ ఖాతాలో డబ్బులు కనిపించకపోతే, మొదట యాజమాన్యాన్ని సంప్రదించవచ్చు. అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే.. ఈపీఎఫ్ఓ అధికారిక ఫిర్యాదుల పోర్టల్ ‘EPFiGMS’ ద్వారా ఆన్‌లైన్‌లో కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు.

ఇక వడ్డీ జమ కావడం ఆలస్యమైతే ఉద్యోగులకు ఏమైనా నష్టం జరుగుతుందా? అంటే.. ఎలాంటి నష్టం ఉండదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈపీఎఫ్ స్కీమ్ 1952లోని పారాగ్రాఫ్ 60 ప్రకారం.. వడ్డీ పాస్‌బుక్‌లో కనిపించడం ఆలస్యమైనా సరే చందాదారులకు ఎలాంటి వడ్డీ నష్టం వాటిల్లదు. ఎందుకంటే వడ్డీ నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్‌పైనే లెక్కిస్తూ జమ అవుతుంది కాబట్టి సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనా సరే రావాల్సిన 8.25 శాతం వడ్డీ మొత్తం ఎక్కడికీ పోదు. 

©️ VIL Media Pvt Ltd.