Reading Time: < 1 minute

పాతబస్తీలో పట్టపగలే రూ.17 లక్షలు చోరీ…  స్కెచ్ వేసి కాజేసిన క్యాష్ లాజిస్టిక్స్ వ్యాన్ డ్రైవర్ 

Caption of Image.

మలక్ పేట, వెలుగు: పాతబస్తీలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ క్యాష్ లాజిస్టిక్స్ వ్యాన్ నుంచి డ్రైవర్ పథకం ప్రకారం.. రూ.17 లక్షలు కాజేసి, పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం ఐఎస్ సదన్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఐఎస్ సదన్ ఈదీ బజార్ బనాకా వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో డబ్బును డిపాజిట్​చేయడానికి క్యాష్​ఏజెన్సీ సిబ్బంది వ్యాన్​లో తీసుకువచ్చింది. 

సిబ్బంది, సెక్యూరిటీ గార్డు కొంత డబ్బును ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన వ్యాన్ డ్రైవర్ చిర్రా శ్రీనివాస్ తన వెనక సీట్లో ఉన్న ట్రంక్ పెట్టె నుంచి  రూ.17 లక్షలు తీసి, బ్యాగ్ లో పెట్టుకున్నాడు. కాగా, ముందే వేసుకున్న పథకం ప్రకారం.. శ్రీనివాస్​కు తెలిసిన వ్యక్తి బైక్​తీసుకొని వచ్చాడు. 

క్షణాల్లో ఆ ఇద్దరూ డబ్బుతో పారిపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.