
ప్రస్తుతం కాలంలో పిల్లల చదువులు, పెళ్లిళ్లకు పొదుపు అనేది కంపల్సరీగా మారింది. జీవితంలో ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. సంపాదించిన డబ్బును సంపాదించినట్లు ఖర్చు చేసుకుంటూ పోతే.. భవిష్యత్తులో అనుకోని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు చేతులు చాచాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ పొదుపు చేయడం లేదా సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేము అనుకునే సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్. ఈ స్కీమ్‌లో ప్రతిరోజూ కేవలం రూ.115 పొదుపు చేయడం ద్వారా లక్షల్లో ఎలా రాబడి పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న మొత్తాల పొదుపు.. పెద్ద మొత్తం లాభం..
చాలా మంది తాము పెద్ద మొత్తంలో డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేమని భావించి పొదుపునకు దూరంగా ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ పోస్టల్ రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇందులో మీరు ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతూ స్థిరమైన, సురక్షితమైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పథకం కాబట్టి ఇందులో మీ డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. పూర్తి సురక్షితంగా ఉంటుంది.
రోజుకు రూ.115 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.3,500..
ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంపై ప్రభుత్వం 6.7 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ లెక్కన మీరు ప్రతిరోజూ కేవలం రూ.115 పక్కన పెడితే.. నెలకు రూ.3,500 అవుతుంది. ఈ మొత్తాన్ని మీరు ప్రతి నెలా ఆర్‌డీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.
5 ఏళ్లలో రూ. 2.5 లక్షల రాబడి ఎలా అంటే?
పోస్టాఫీస్ ఆర్‌డీ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. అంటే మీరు 60 నెలల పాటు నిరంతరంగా ప్రతి నెలా రూ.3,500 పెట్టుబడి పెట్టాలి.
- మీరు పెట్టే మొత్తం పెట్టుబడి: రూ. 2,10,000
- 6.7శాతం వడ్డీ రేటు ప్రకారం వచ్చే వడ్డీ: రూ. 39,000
- మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి వచ్చే మొత్తం: రూ. 2,49,000
అంటే కేవలం రోజుకు రూ. 115 చొప్పున మీ జేబు ఖర్చులను తగ్గించుకుని పొదుపు వైపు అడుగులు వేస్తే.. 5 ఏళ్లలో తిరిగేసరికి మీ చేతిలో దాదాపు రెండున్నర లక్షల రూపాయల పెద్ద మొత్తం ఉంటుంది. ఈ డబ్బు మీ పిల్లల చదువులకు, అత్యవసర వైద్య ఖర్చులకు లేదా ఇతర అవసరాలకు ఎంతో అండగా నిలుస్తుంది.