
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణానికి చెందిన కేశెట్టి అనసూయ(85) అనే వృద్ధురాలు తన కోడళ్ల వేధింపులపై సోమవారం ఆర్డీవో కార్యాలయం, టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ సాయంతో ఆర్డీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి వసంతకు ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేశారు.
అనంతరం బాధితురాలు మాట్లాడుతూ.. విద్యానగర్‌లోని తమ సొంత ఇంట్లో ఇద్దరు కొడుకులకు చెరో రెండు గదులు ఇచ్చి, మిగిలిన రెండు గదుల్లో తాను, మతిస్థిమితం లేని అవివాహిత కూతురుతో కలిసి నివసిస్తున్నట్లు తెలిపారు. చిన్న కోడలు తమ గదిని బలవంతంగా ఆక్రమించి కిరాణా దుకాణం నడుపుతోందని, ఖాళీ చేయమంటే చంపుతామని బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద కోడలు మరుగుదొడ్డి, స్నానగదులకు తాళాలు వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. తన పోషణను కొడుకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.