Reading Time: < 1 minute
Ecb Clears Ben Stokes And Gus Atkinson In Nightclub Controversy No Disciplinary Action

Ben Stokes: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes), యువ పేసర్ గస్ అట్కిన్సన్‌ (Gus Atkinson)కు నైట్‌క్లబ్ వివాదంలో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనలో ఇద్దరు ఆటగాళ్లపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్ అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ నైట్‌క్లబ్‌లో కనిపించగా.. అదే సమయంలో ప్రీమియర్‌షిప్ రగ్బీ క్లబ్ సారసెన్స్‌కు చెందిన ఓ ఆటగాడు జట్టు భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేసిన ఘటన వివాదానికి దారితీసింది. ఈ ఘటనతో స్టోక్స్, అట్కిన్సన్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వ్యవహారాన్ని పరిశీలించిన ఇండిపెండెంట్ క్రికెట్ రెగ్యులేటర్ అన్ని ఆధారాలను సమీక్షించిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని తేల్చింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ.. ఎలాంటి రెగ్యులేటరీ ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించే ఆధారాలు లభించలేదని రెగ్యులేటర్ తన ప్రకటనలో పేర్కొంది.

దీంతో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్‌లపై ఉన్న కెరియర్ అనిశ్చితికి తెరపడింది. ముఖ్యంగా గాయాల నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన స్టోక్స్‌కు ఈ నిర్ణయం మరింత ఊరటనిచ్చింది. ఇక ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ది ఓవల్‌లో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 200 పరుగులకు పైగా ఘన విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. ఇక చివరి టెస్ట్ జూన్ 25 నుంచి నాటింగ్‌హామ్‌ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగనుంది. సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఇరు జట్లు ఊవిళ్లు ఊరుతున్నాయి. బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండటం ఇంగ్లండ్‌కు అదనపు బలాన్ని ఇవ్వగా.. న్యూజిలాండ్‌కు మ్యాచ్ మరో సవాల్‌గా మారనుంది.