
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి దూరమయ్యాడు. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత నితీష్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం తిరగబెట్టడంతో వైద్యుల సూచన మేరకు బీసీసీఐ అతడిని ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ నుంచి పక్కకు తప్పించింది. నితీష్ స్థానంలో యువ బ్యాటర్ సూర్యాంశ్ షెడ్గేను బీసీసీఐ రీప్లేస్మెంట్ ప్రకటించింది.
దీంతో ఐర్లాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు, ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు నితీష్ స్థానంలో సూర్యాంశ్ బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు నితీష్ దూరమైనట్లు బీసీసీఐ ధృవీకరించడంతో.. జూలై 14 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు ఈ ఆల్ రౌండర్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఎవరీ సూర్యాంశ్ షెడ్గే..?
ముంబైకి చెందిన 23 ఏళ్ల సూర్యాంశ్ షెడ్గే ఆల్ రౌండర్. ఇటీవల దేశవాళీ క్రికెట్, ఇండియా ‘ఎ’ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై విజయం సాధించడంలో ఈ యువ ఆల్ రౌండర్ కీ రోల్ ప్లే చేశాడు. లక్నో జట్టు ద్వారా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్యాంశ్. 2025 ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ సూర్యాంశ్ షెడ్గేను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ తరపున 175.55 స్ట్రైక్ రేట్‌తో 158 పరుగులు చేసి సత్తా చాటాడు.
►ALSO READ | ఐపీఎల్ చరిత్రలోనే బిగ్ ట్రేడ్ డీల్.. ఢిల్లీకి పంత్.. లక్నోకు కుల్దీప్
ఇటీవల శ్రీలంక, ఆప్ఘానిస్తాన్, ఇండియా మధ్య జరిగిన ట్రై సిరీస్ లోనూ సూర్యాంశ్ మెరిశాడు. ఈ ట్రై సిరీస్‌లో ఇండియా-A తరపున 5 మ్యాచ్‌లలో 147 పరుగులు చేయడంతో పాటు.. బౌలింగ్‌లోనూ రాణించాడు. తద్వారా తన నిలకడైన ప్రదర్శనతో జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కు దూరం కావడంతో అతడి స్థానంలో బీసీసీఐ సూర్యాంశ్ షెడ్గేను ఎంపిక చేసింది.