
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ గుర్తింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాస్‌పోర్ట్ అనేది కేవలం విదేశాలకు వెళ్లేందుకు ఉపయోగపడే ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని.. అది పౌరసత్వ పత్రం కాదని స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ క్లారిటీ ఇచ్చింది.
కాగా, పాస్ పోర్టుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయినప్పటికీ పాస్‌పోర్టు గుర్తింపు గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మరోసారి క్లారిటీ ఇచ్చింది. పాస్‌పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని.. అది పౌరసత్వానికి రుజువు కాదని స్పష్టం చేసింది.
ఇక, భారతదేశ పాస్‌పోర్ట్ సేవల నెట్‌వర్క్ విస్తరణ, చిప్ ఆధారిత ఇ-పాస్‌పోర్ట్‌ల విజయవంతంతో సహా అనేక మైలురాళ్లను విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025లో 1.5 కోట్ల పాస్‌పోర్ట్‌లు, సంబంధిత సేవలు అందించగా.. వాటిలో కేవలం పాస్‌పోర్ట్‌లే 1.39 కోట్లు ఉన్నట్లు తెలిపింది.
అంతేకాకుండా ఆరు పనిదినాలలోపు పాస్‌పోర్ట్‌లు అందజేయబడుతుండటంతో పాటు సగటు ప్రాసెసింగ్ సమయం కూడా మెరుగుపడిందని తెలిపింది. పౌరులు ఇప్పుడు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో సగటున 45 నిమిషాల కంటే తక్కువ సమయం గడుపుతున్నారని పేర్కొంది. అయితే, పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్‌కే కాస్తా సమయం ఎక్కువ పడుతోందని.. ఇది ఒక్కటే ఇంకాస్త మెరుగుపడాలని తెలిపింది.