
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టిన చమురు రేట్లు.. ఇప్పుడు దాదాపు 4 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. మధ్యప్రాచ్యంలో తగ్గిన టెన్షన్స్, మార్కెట్లోకి ముడిచమురు సరఫరా పెరగడమే ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 76.54 డాలర్లకు పడిపోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 72.69 డాలర్ల వద్ద ట్రేడవుతూ గత రెండు సెషన్ల నష్టాలను మరింత ముందుకు తీసుకెళ్లింది. ఈ నెల ప్రారంభంలో ఇరాన్ ఘర్షణల వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ ద్వారా క్రూడ్ రవాణా నిలిచిపోతుందేమోనన్న భయాలతో ధరలు ఒక్కసారిగా పెరిగినప్పటికీ.. ఇప్పుడు ఆ ఆందోళనలు తొలగిపోవడంతో ధరలు వేగంగా దిగొస్తున్నాయి.
ముడిచమురు ధరలు ఇంతలా పడిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లోకి సరఫరా క్రమంగా పుంజుకోవడమే. ఇరాన్ వివాదం సమయంలో గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన అనేక ఆయిల్ ట్యాంకర్లు ఇప్పుడు హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించడానికి సిద్ధమవుతున్నాయి. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా 60 రోజుల పాటు ఆంక్షల మినహాయింపు ఇవ్వడం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. దీనివల్ల ఇరాన్ యథేచ్ఛగా ముడిచమురును విక్రయించుకునే అవకాశం లభించింది. అలాగే హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై చర్చలు కొనసాగించేందుకు ఒమన్, ఇరాన్ దేశాలు అంగీకరించడం కూడా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌కు పెద్ద ఉపశమనం కలిగించింది. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన పురోగతి కారణంగా గత కొన్ని నెలలుగా చమురు ధరలకు మద్దతుగా నిలిచిన ‘జియోపొలిటికల్ రిస్క్ ప్రీమియం’ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని నిపుణులు అంటున్నారు.
ట్యాంకర్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. గత వారంలో ఆసియా దేశాల వైపు 30 మిలియన్ బారెల్స్ ముడిచమురు ప్రయాణిస్తోంది. ఇందులో గతంలో నిలిచిపోయిన నిల్వలతో పాటు ఇరాన్ నుంచి వస్తున్న తాజా ఎగుమతులు కూడా ఉన్నాయి. ఆసియా కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఇరాన్ భారీగా డిస్కౌంట్లు ఇస్తుండటం, గల్ఫ్ దేశాల ఉత్పత్తిదారులు కీలక సౌకర్యాల వద్ద కార్యకలాపాలను పునఃప్రారంభించడం మార్కెట్లో సరఫరాను పెంచేసింది. గ్లోబల్ డిమాండ్ అంచనాలు బలహీనపడటం కూడా ధరల తగ్గుదలకు కారణమైంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ, ఒపెక్ రెండు కూడా 2026 సంవత్సరానికి గానూ తమ చమురు డిమాండ్ వృద్ధి అంచనాలను తగ్గించాయి. షిప్పింగ్ మార్గాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చి.. ఉత్పత్తి పెరిగితే 2027 నాటికి మార్కెట్ మిగులు సరఫరా దిశగా వెళ్లే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారతదేశానికి ముడిచమురు ధరల తగ్గుదల ఒక గొప్ప శుభవార్త. భారత్ తన చమురు అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్ల దేశ దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గుతుంది. రూపాయి విలువ బలపడుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయి. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గిన వెంటనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశించే వినియోగదారులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఎందుకంటే భారతదేశంలో ఇంధన ధరలు కేవలం క్రూడాయిల్ పైనే కాకుండా పన్నులు, రిఫైనింగ్ మార్జిన్లు, మార్కెటింగ్ ఖర్చులపై ఆధారపడి ఉంటాయి.