
వాంకోవర్: ఫిఫా వరల్డ్ కప్‌లో ఈజిప్ట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన గ్రూప్–జి లీగ్ మ్యాచ్‌లో 3–1తో న్యూజిలాండ్‌పై సంచలన విజయం సాధించింది. ఫలితంగా మెగా టోర్నీ చరిత్రలో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆట ప్రారంభం నుంచి మెరుగ్గా ఆడిన కివీస్ తొలి హాఫ్‌లో ఆధిక్యంలో నిలిచింది.
15వ నిమిషంలో ఫిన్ సుర్మాన్ అద్భుతమైన హెడర్‌తో గోల్ కొట్టాడు. ఈజిప్ట్ ప్లేయర్లు సెకండాఫ్‌లో ఎదురుదాడికి దిగారు. 58వ నిమిషంలో ముస్తఫా జికో హెడర్‌తో గోల్ కొట్టి స్కోరును 1–1తో సమం చేశాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో జికో ఇచ్చిన పాస్‌ను అందుకున్న సలాహ్ దూరం నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి ఈజిప్ట్ ఆధిక్యాన్ని 2–1కి పెంచాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌లో అతనికిది 68వ గోల్ కావడం విశేషం.
అలాగే తమ కోచ్ హుస్సామ్ హసన్ పేరిటి ఉన్న ఆల్‌టైమ్ టాప్ స్కోరర్ రికార్డుకు కేవలం ఒక గోల్ దూరంలో నిలిచాడు. 82వ నిమిషంలో ట్రెజెగెట్ డైవింగ్ హెడర్‌తో మరో గోల్ చేయడంతో ఈజిప్ట్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయంతో ఈజిప్ట్ పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరినా నాకౌట్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. శుక్రవారం సియాటెల్‌లో ఇరాన్‌తో జరిగే నిర్ణయాత్మక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ఈజిప్ట్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది.