
George Krish : ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్‌లతో టాలీవుడ్‌ను ఊపేసిన దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు బలమైన కమ్‌బ్యాక్ కోసం సిద్ధమవుతున్నారు. మరోవైపు విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్ కూడా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘జార్జ్ క్రిష్’ ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తకరకంగా మారింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపిక, షూటింగ్ షెడ్యూల్, రిలీజ్ పై వస్తున్న వార్తలు ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘జార్జ్ క్రిష్’ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై గత కొంతకాలంగా అనేక పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం యువ నటి భాగ్యశ్రీ బోర్సేను కథానాయికగా ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఆమె పేరే దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వరుస ప్రాజెక్ట్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న భాగ్యశ్రీ ఈ చిత్రంలో నటిస్తే, శర్వానంద్‌తో ఆమె జోడీ కొత్తగా కనిపించే అవకాశం ఉంది.
సినిమా నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించి, కీలకమైన ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత జరిగే రెండో షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య సాగే ప్రేమకథకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కథలో ఎమోషన్, కామెడీ, రొమాన్స్‌కు ప్రాధాన్యం ఉండేలా శ్రీను వైట్ల స్క్రీన్‌ప్లే రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే నమ్మకంతో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. అందుకే షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని పనులను వేగంగా పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం.
శ్రీను వైట్లకు ఈ సినిమా కెరీర్ పరంగా ఎంతో కీలకంగా మారనుంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వం’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఈసారి ప్రేక్షకులను పూర్తిస్థాయి ఎంటర్‌టైన్ చేసే కథతో రావాలని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తెలియని వయసులో హీరో చేసిన ఒక చిన్న పొరపాటు, ఆ నిర్ణయం కారణంగా అతని జీవితంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాల చుట్టూ కథ సాగుతుందని సమాచారం. కామెడీతో పాటు ఎమోషన్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చేలా కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందిస్తుందా? శ్రీను వైట్లకు ఇది బలమైన కమ్‌బ్యాక్ మూవీ అవుతుందా? అనే ఆసక్తి ప్రస్తుతం సినీ అభిమానుల్లో అయితే కనిపిస్తోంది. ఇప్పుడీ హీరో సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ‘భోగి’ (Bhogi)లో నటిస్తున్నారు. ఆ సినిమాను ఆగస్టు 28న థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.