Reading Time: < 1 minute

తెలంగాణ కేడర్‌‌‌‌కు సంజయ్ జాజు.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్రం ఉత్తర్వులు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజు(1992 బ్యాచ్ తెలంగాణ కేడర్) తిరిగి తన సొంత కేడర్‌కు రానున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను మళ్లీ మాతృ కేడర్ తెలంగాణకు పంపుతూ (రీపాట్రియేషన్) కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో అత్యున్నత పరిపాలనా అధికారి మార్పునకు సంబంధించి ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30తో పదవీ విరమణ చేయనున్నారు.

ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా సంజయ్ జాజును నియమించేందుకే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసి, ఆయనను రాష్ట్ర సర్వీసుల్లోకి రప్పించిందనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆయనతో పాటు సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, జయేశ్ రంజన్ కూడా ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.