
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)ను ప్రైవేటీకరించడం లేదని జెన్కో సీఎండీ హరీశ్ స్పష్టం చేశారు. పవర్ప్లాంట్ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్లో భాగంగా కొన్ని పనులను చట్ట ప్రకారం ప్రైవేట్ ఏజేన్సీలకు బాధ్యతలు అప్పగించడం ఎప్పటినుంచో జరుగుతున్నదని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వైటీపీఎస్లోని యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ పనులను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు.
‘తెలంగాణ ప్రభుత్వానికిగానీ, టీజీ జెన్కో యాజమాన్యానికి గానీ వైటీపీఎస్ను, దాని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలోని ఏ విభాగాన్నైనా ప్రైవేటీకరించాలనే ఉద్దేశం లేదు. ఈ విద్యుత్ కేంద్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జెన్కో యాజమాన్యంలోనే కొనసాగుతుంది’ అని హరీశ్ స్పష్టం చేశారు.
వైటీపీఎస్ స్టేజ్ 1లో వివిధ పనులను అనేక ఏజెన్సీలు చేపట్టడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, ప్లాంట్ నిర్వహణను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు, ఈ పనులను ఒకే ప్రత్యేక నైపుణ్యం కలిగిన సంస్థకు అప్పగించామని పేర్కొన్నారు.