Reading Time: < 1 minute
Chandrababu Naidu Warns Critics Over Remarks Against Pawan Kalyan

CM Chandrababu Warning: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే ఖబర్దార్‌ అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సాయికృష్ణ ఘటనకు కూడా కులం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి విమర్శలకు తగిన సమాధానం చెప్పే శక్తి తమకు ఉందని పేర్కొన్నారు. ఇక, గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని ఆరోపించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి అపచారం చేశారని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని ప్రజలు, భక్తులు ఎప్పటికీ క్షమించరని అన్నారు.

స్వామివారికి అపచారం జరిగితే బాధ్యులను శిక్షించాలా లేదా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఇప్పుడు అదే వ్యక్తులు దేవాలయాల చుట్టూ తిరుగుతూ భక్తి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. దేవుడిని నిజంగా విశ్వసించే ఏ వ్యక్తి కూడా అలాంటి చర్యలను సమర్థించరని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షంగా ఉన్న ‘గొడ్డలి పార్టీ’ రాష్ట్రంలో విషపూరిత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. నేరాలు చేయడంలో ఆ పార్టీ నేతలు సమర్థులని విమర్శించారు. మెగా డీఎస్సీ పూర్తయి ఏడాది గడిచిన తర్వాత పేపర్ లీక్ జరిగిందని ఆరోపించడం విచిత్రమని చంద్రబాబు అన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్‌ సవాల్ విసిరినా ప్రతిపక్ష నేతలు స్పందించలేదని తెలిపారు. అలాగే ఉద్యోగుల సంక్షేమంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్నికల హామీల్లో లేకపోయినా దాదాపు 11 వేల మంది ఉద్యోగులను సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి తీసుకువచ్చి వారి జీవితాల్లో భరోసా కల్పించామని వెల్లడించారు సీఎం చంద్రబాబు..